పురిటి నొప్పులతో అల్లాడుతున్న గర్భిణికి ఇంట్లోనే సుఖప్రసవం చేసి తమ విధుల పట్ల తమ నిబద్ధతను చాటుకున్నారు 108 సిబ్బంది.
_ ఇంట్లోనే ప్రసవం.. ఆడబిడ్డ జననం…
_ షాపూర్ నగర్ ఆరోగ్య కేంద్రానికి తరలింపు
లోకల్ వైబ్స్, చింతల్: ఆపదలో ఉన్నవారికి ఆపద్బాంధవులుగా నిలుస్తూ 108 అంబులెన్స్ సిబ్బంది మరోసారి తమ సమయస్ఫూర్తితో వ్యవహరించి, పురిటి నొప్పులతో అల్లాడుతున్న గర్భిణికి ఇంట్లోనే సుఖప్రసవం చేసి తమ విధుల పట్ల తమ నిబద్ధతను చాటుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతల్ ప్రాంతానికి చెందిన గోపికృష్ణ, అక్షిత దంపతులు. గర్భిణి అయిన అక్షితకు గురువారం వేకువజామున తీవ్ర పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై వెంటనే 108 అత్యవసర విభాగానికి సమాచారం అందించారు. సమాచారం అందిన కొద్దిసేపటికే 108 అంబులెన్స్ ఈఎంటీ నరేందర్ రెడ్డి, పైలట్ బాలు అక్కడికి చేరుకున్నారు.

పరిస్థితిని అంచనా వేసి సమయస్ఫూర్తిగా…
అప్పటికే నొప్పులు తీవ్రమై, ఆసుపత్రికి తరలించే సమయం కూడా లేకపోవడాన్ని గుర్తించారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా కుటుంబ సభ్యుల సమక్షంలో అత్యవసర వైద్య పరికరాల సాయంతో ఇంటి వద్దే ప్రసవం చేపట్టారు. సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించడంతో అక్షిత మొదటి కాన్పులోనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.తల్లీబిడ్డ ఇద్దరూ పూర్తి ఆరోగ్యంగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ప్రథమ చికిత్స అందించి, మెరుగైన సంరక్షణ కోసం వారిని షాపూర్‌నగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర సమయంలో దేవదూతల్లా వచ్చి సుఖప్రసవం చేసిన 108 సిబ్బంది నరేందర్ రెడ్డి, డ్రైవర్ బాలులకు కుటుంబ సభ్యులు, బంధువులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. సమయానికి స్పందించి ప్రాణాలు కాపాడిన సిబ్బందిని స్థానికులు సైతం ప్రత్యేకంగా అభినందించారు.

