HomeUncategorizedఘనంగా శివ శివాని ‘సమవర్తన–2026’

ఘనంగా శివ శివాని ‘సమవర్తన–2026’

Date: Posted By : LOCAL VIBES

Copyright © 2026 LOCAL VIBES. All rights reserved.

విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు వేదికగా నిలిచిన కొంపల్లిలోని ప్రఖ్యాత శివ శివాని డిగ్రీ కళాశాల (అటానమస్) రెండవ సమవర్తన–2026 (స్నాతకోత్సవం) ఆదివారం కొంపల్లి లో ఉన్న హైదవ గౌరిక్ కన్వెన్షన్ హాల్‌లో అత్యంత ఘనంగా, కన్నులపండువగా సాగింది.

_ కొంపల్లిలోని శివ శివాని డిగ్రీ కళాశాల (అటానమస్) ఆధ్వర్యంలో రెండవ స్నాతకోత్సవం అత్యంత వైభవంగా నిర్వహణ..

_ వివిధ కోర్సులు పూర్తి చేసిన దాదాపు 700 మంది పట్టభద్రులకు ఉస్మానియా వర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ బి. సుధాకర్ రెడ్డి చేతుల మీదుగా డిగ్రీ పట్టాల ప్రదానం..

_ విద్య కేవలం డిగ్రీకి పరిమితం కాకుండా నిరంతరం నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని గౌరవ అతిథి పిలుపు…

_ ప్రథమ, ద్వితీయ, తృతీయ ర్యాంకులు సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులకు వరుసగా రూ.20,000, రూ.10,000, రూ.5,000 చొప్పున నగదు బహుమతుల అందజేత..

_ ఆనందోత్సాహాల నడుమ తల్లిదండ్రులు, అధ్యాపకులు, విద్యార్థుల పెద్దసంఖ్యలో హాజరుతో విజయవంతంగా ముగిసిన వేడుక..

లోకల్ వైబ్స్, కొంపల్లి: విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు వేదికగా నిలిచిన కొంపల్లిలోని ప్రఖ్యాత శివ శివాని డిగ్రీ కళాశాల (అటానమస్) రెండవ సమవర్తన–2026 (స్నాతకోత్సవం) ఆదివారం కొంపల్లి లో ఉన్న హైదవ గౌరిక్ కన్వెన్షన్ హాల్‌లో అత్యంత ఘనంగా, కన్నులపండువగా సాగింది. ఈ వేడుకలో కళాశాల నుంచి వివిధ విభాగాల్లో ఉత్తీర్ణులైన సుమారు 7 వందల మంది యువతీయువకులు ఉత్సాహంగా డిగ్రీ పట్టాలను అందుకున్నారు.

సమాజ అభివృద్ధికి విద్యను వినియోగించాలి: ప్రొఫెసర్ బి. సుధాకర్

ఈ కార్యక్రమానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ బి. సుధాకర్ రెడ్డి గౌరవ అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు తాము సంపాదించుకున్న విద్యా జ్ఞానాన్ని సమాజ సర్వతోముఖాభివృద్ధికి వినియోగించాలని ఆకాంక్షించారు. నేటి వేగంగా మారుతున్న ప్రపంచంలో కేవలం డిగ్రీ పట్టాతో సరిపెట్టుకోకుండా, నిరంతరం కొత్త విషయాలను అభ్యసిస్తూ, సాంకేతిక పరిజ్ఞానానికి తగినట్లుగా నైపుణ్యాలను పెంపొందించుకోవడం ఎంతో కీలకమని సూచించారు.

మాట్లాడుతున్న ప్రొఫెసర్ సుధాకర్ రెడ్డి…

విజయాలకు తల్లిదండ్రులు, అధ్యాపకుల కృషియే ఆధారం: ఎస్ ఎస్ జి ఐ ప్రెసిడెంట్ ఎస్. ఆరతి

శివ శివాని గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ అధ్యక్షురాలు ఎస్. ఆరతి అధ్యక్షత వహించిన ఈ సభలో మాట్లాడుతూ.. విద్యార్థులు సాధించిన ఈ ఘన విజయం వారి పట్టుదలతో పాటు, తల్లిదండ్రులు, అధ్యాపకుల త్యాగాలకు ప్రతిఫలమని కొనియాడారు. డిగ్రీ పట్టా అనేది విద్యార్థుల విద్యా ప్రయాణంలో ఒక మైలురాయి మాత్రమేనని, ఇది వారి భవిష్యత్తులో రాణించడానికి సరికొత్త అవకాశాలకు అంకురార్పణ అని పేర్కొన్నారు.

వృత్తి జీవితంలో మానవీయ విలువలే శ్రీరామరక్ష: డా. శైలేష్ సంపతి

వైస్ ప్రెసిడెంట్ & డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డా. శైలేష్ సంపతి మాట్లాడుతూ.. విద్యార్థులు తమ కెరీర్‌లో జ్ఞానంతో పాటు నిజాయితీ, క్రమశిక్షణ, బాధ్యత, మానవీయ విలువలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని హితవు పలికారు. జీవితంలో ఎదురయ్యే విజయాలు, అపజయాలను ఒకేలా స్వీకరించి, ప్రతీ అనుభవం నుంచి గుణపాఠం నేర్చుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

స్నాతకోత్సవ కార్యక్రమంలో వేదికపై అతిధులు…

దేశ ప్రగతికి యువతే ప్రధాన శక్తి: దీపికా సంపతి

అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ దీపికా సంపతి మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తుకు యువతే ప్రధాన చోదక శక్తి అని ఉద్ఘాటించారు. యువత తమ ప్రతిభను దేశ ప్రగతికి బాటలు వేసేలా ఉపయోగించాలని, ఎంచుకున్న రంగంలో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.కళాశాల ప్రిన్సిపాల్ పి. మమత ఈ సందర్భంగా సంస్థ అకడమిక్ రిపోర్టును చదివి వినిపించారు. కళాశాల విద్యా ప్రమాణాలు, నూతన కోర్సులు, విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, ప్లేస్‌మెంట్లు, పరిశ్రమలతో గల అనుసంధానంలో సాధించిన పురోగతిని వివరించారు.ప్రతిభావంతులకు నగదు బహుమతుల ప్రదానంకార్యక్రమంలో భాగంగా వివిధ కోర్సుల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులను ఘనంగా సత్కరించారు. ప్రథమ ర్యాంకు సాధించిన వారికి రూ.20,000, ద్వితీయ ర్యాంకు వారికి రూ.10,000, తృతీయ ర్యాంకు వారికి రూ.5,000 చొప్పున నగదు బహుమతులు అందజేసి అభినందించారు.ఈ వేడుకలో శివ శివాని గ్రూప్ సంస్థల వివిధ విభాగాధిపతులు, బోధనా, బోధనేతర సిబ్బంది, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు …అధ్యాపకులు..
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments