లోకల్ వైబ్స్, జీడిమెట్ల: కొంపల్లి నూజివీడు కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో తీవ్రమైన పురిటినొప్పులతో బాధపడుతున్న సారా పారియార్ అనే గర్భిణికి 108 సిబ్బంది అత్యవసర ప్రసవం చేసి ప్రాణాలు కాపాడారు. సమాచారం అందుకున్న వెంటనే 108 ఈఎంటీ చంద్రశేఖర్, పైలట్ రాజశేఖర్‌లు అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నారు. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించేలోపే అక్కడే ప్రసవం చేయడం సురక్షితమని భావించి, వారు అత్యవసరంగా డెలివరీ విజయవంతంగా నిర్వహించారు. ఈ ప్రసవంలో సారా పారియార్ ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు నిర్ధారించుకున్నాక, మెరుగైన వైద్యం కోసం వారిని వెంటనే మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ప్రాణాలను కాపాడిన 108 సిబ్బంది చంద్రశేఖర్, రాజశేఖర్‌ల సమయస్ఫూర్తిని స్థానికులు అభినందించారు.


