మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్ మండల పరిధిలోని సర్వే నంబర్ 472లో హౌసింగ్ బోర్డుకు కేటాయించిన సుమారు 20 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణకు యత్నించిన నిందితులపై అధికారులు ఉక్కుపాదం మోపారు.
– బేస్మెంట్ల కూల్చివేత.. క్రిమినల్ కేసులకు హెచ్చరిక…
– బౌరంపేట్ సర్వే నంబర్ 472లో 20 ఎకరాల హౌసింగ్ బోర్డు స్థలం ఆక్రమణపై చర్యలు…
లోకల్ వైబ్స్, దుండిగల్: మండల పరిధిలోని సర్వే నంబర్ 472లో హౌసింగ్ బోర్డుకు కేటాయించిన సుమారు 20 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణకు యత్నించిన నిందితులపై అధికారులు ఉక్కుపాదం మోపారు. కోట్లాది రూపాయల విలువైన ఈ స్థలంలో అక్రమంగా వెంచర్ ఏర్పాటు చేసి, అమాయక ప్రజలకు ప్లాట్లు విక్రయిస్తున్నారంటూ స్థానిక నాయకుడు ఆకుల సతీష్ మంగళవారం ఎంఆర్ఓ రాజేశ్వర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.
సత్వర స్పందనగా…
ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన ఎంఆర్ఓ రాజేశ్వర్ రెడ్డి, రెవెన్యూ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన మూడు బేస్మెంట్లను పొక్లెయిన్లతో ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఆకుల సతీష్ మాట్లాడుతూ.. 2024లోనే ఈ భూమిలో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారని గుర్తుచేశారు. హౌసింగ్ బోర్డు అధికారులు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయకపోవడాన్ని ఆసరాగా చేసుకుని ఆక్రమణదారులు మళ్లీ విక్రయాలకు తెగబడ్డారని ఆరోపించారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, శాశ్వత ప్రాతిపదికన ఫెన్సింగ్ వేయాలని కోరారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, త్వరలోనే హౌసింగ్ బోర్డు అధికారులతో కలిసి జాయింట్ సర్వే నిర్వహించి భూమికి పూర్తిస్థాయి రక్షణ కల్పిస్తామని ఎంఆర్ఓ రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. వెంటనే స్పందించి చర్యలు చేపట్టిన ఎంఆర్ఓ కు ఆకుల సతీష్ బృందం ధన్యవాదాలు తెలిపారు.


