అల్వాల్ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో సీజ్ చేసిన వాహన అంశంపై బాధితుడు హైకోర్టును ఆశ్రయించాడు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు “మద్యం తాగిన వ్యక్తి డ్రైవింగ్ చేస్తున్న క్రమంలో ప్రాసిక్యూషన్ చేయాల్సిన అవసరం ఏర్పడితే మూడు రోజులలో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని, కానీ, చట్టంలో లేని విధంగా వాహనాలను స్వాధీనం చేసుకోకూడదని స్పష్టం చేసింది. MV ACT 448 ఏ ను అమలు చేయాలని, తీర్పును ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కరణ కింద చర్యలు తప్పవని పోలీసులను హెచ్చరించింది”.
*– జప్తు పై హైకోర్టు మరోసారి కీలక ఉత్తర్వులు*
*– అల్వాల్ ట్రాఫిక్ పోలీసులు జప్తు చేసిన వాహన విషయంపై …*
*– కోర్టును ఆశ్రయించిన బాధితుడు*
*– 2021 లో ఇదే అంశంపై ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ…*
*– మరోసారి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు విషయంలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన హైకోర్టు*
*– మందుబాబులకు ఊరట కలిగించే తీర్పు అయినప్పటికీ..*
*– డ్రంక్ అండ్ డ్రైవ్ లతో రోడ్డు భద్రత పై తలెత్తుతున్న ప్రశ్నలు..*
లోకల్ వైబ్స్, పేట్ బషీరాబాద్: అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిపోతే.. ఇక మీ వాహనం పోలీస్ స్టేషన్ పాలు కానక్కర్లేదు! వాహనాలను రోజుల తరబడి స్టేషన్లలో బంధించి, శాశ్వతంగా సీజ్ చేసే హక్కు పోలీసులకు లేదని తెలంగాణ హైకోర్టు మరోసారి కుండబద్దలు కొట్టింది. నిబంధనలకు లోబడి తగు జాగ్రత్తలు తీసుకుని బండిని యజమానులకు అప్పగించాల్సిందేనని తేల్చి చెప్పింది. పౌరుల ఆస్తుల హక్కుల కోణంలో, పోలీసుల వేధింపుల నుంచి రక్షణ పరంగా ఇది స్వాగతించదగ్గ పరిణామమే అయినా.. అదే సమయంలో రోడ్డు ప్రమాదాల నివారణపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందనే ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి. అసలు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో వాహనాల జప్తు విషయంలో పాత తీర్పు ఏం చెబుతోంది? కొత్త తీర్పు నేపథ్యం ఏమిటి? అన్నదానిపై ఒక సమగ్ర కథనం.
“వివాదానికి బీజం.. సీరియల్ అఫెండర్ కారు సీజ్!“
అల్వాల్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో జంగటి విజయ్ అనే వ్యక్తికి చెందిన మహీంద్రా XUV 500 కారు పట్టుబడింది. అయితే కారు నడుపుతున్న వ్యక్తి (సాయిరామ్ రావు) పై అప్పటికే 4 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఉండటంతో.. కావాలనే బండి ఇచ్చి యజమాని నేరాన్ని ప్రోత్సహించాడని పోలీసులు భావించి కారును సీజ్ చేశారు. ఎన్నిసార్లు తప్పు చేసినా వదిలేస్తే ఎలా అన్నది పోలీసుల వాదన. కానీ తన కారును సీజ్ చేయడం చట్టవిరుద్ధమంటూ యజమాని కోర్టును ఆశ్రయించడంతో ఈ వివాదం మళ్లీ న్యాయస్థానం మెట్లు ఎక్కింది. అయితే, కారు ఓనర్ తాను బండి నడపలేదని, బండిని సీజ్ చేయడం చట్టవిరుద్ధమని కోర్టును ఆశ్రయించడంతో “డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనాల జప్తు” అంశం మళ్లీ తెరపైకి వచ్చింది.
కొత్త తీర్పు (2026): జస్టిస్ వేణుగోపాల్ ఏం చెప్పారు?
ఫిబ్రవరి 6, 2026న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇ.వి. వేణుగోపాల్ (W.P.No. 38805 of 2025) ఈ కేసులో కీలక తీర్పు వెలువరించారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం పోలీసులకు కేవలం మద్యం తాగారన్న ఒకే ఒక్క కారణంతో వాహనాన్ని జప్తు చేసి, పోలీస్ స్టేషన్లలో ఉంచుకునే అధికారం లేదని ఆయన స్పష్టం చేశారు. సరైన పత్రాలతో వస్తే యజమానికి వాహనం తిరిగి ఇచ్చేయాలని ఆదేశించారు. చట్టం అనుమతించని శిక్ష వేయొద్దు అని, వ్యక్తి మద్యం తాగి ఉన్నాడా లేదా అని మాత్రమే పోలీసులు చూడాలని, ఒకవేళ తాగి ఉంటే మోటారు వాహనాల చట్టం (MV Act) ప్రకారం చర్యలు తీసుకోవాలి అని, మద్యం తాగిన వ్యక్తి డ్రైవింగ్ చేస్తున్న క్రమంలో ప్రాసిక్యూషన్ చేయాల్సిన అవసరం ఏర్పడితే మూడు రోజులలో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని, కానీ, చట్టంలో లేని విధంగా వాహనాలను స్వాధీనం చేసుకోకూడదని స్పష్టం చేసింది. MV ACT 448 ఏ ను అమలు చేయాలని, తీర్పును ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కరణ కింద చర్యలు తప్పవని పోలీసులను హెచ్చరించింది.
పాత తీర్పు (2021) ఆధారంగా..జస్టిస్ కె. లక్ష్మణ్ మార్గదర్శకాలే పునాది
ఈ కొత్త తీర్పుకి అసలు పునాది 2021 అక్టోబర్ 29న జస్టిస్ కె. లక్ష్మణ్ ఇచ్చిన తీర్పే (W.P.No. 1647 of 2021). అప్పట్లో అనేకమంది తమ బండ్లను పోలీసులు అక్రమంగా సీజ్ చేస్తున్నారని కోర్టుకెక్కగా.. న్యాయమూర్తి పోలీసులకు కచ్చితమైన మార్గదర్శకాలు నిర్దేశించారు. వాహనంలో మద్యం సేవించని డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న ప్రయాణికుడికి బండి అప్పగించాలని, లేదా బంధువులకు ఫోన్ చేయాలని, ఎవరూ రాకపోతేనే సేఫ్ కస్టడీలో ఉంచాలని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. ఇప్పుడు 2026లో జస్టిస్ వేణుగోపాల్ కూడా ఆ పాత తీర్పును యథాతథంగా అమలు చేయాలని ఆదేశించడం విశేషం.
*వ్యవస్థపై చురకలు: టార్గెట్లు ఇచ్చి జరిమానాలా?*
పాత తీర్పు కాపీలో న్యాయస్థానం ప్రభుత్వాల తీరును తీవ్రంగా ఆక్షేపించింది. ఒకవైపు ఎక్సైజ్ శాఖ ద్వారా మద్యం అమ్మకాలు పెంచాలని అధికారులపై ఒత్తిడి చేస్తూనే, మరోవైపు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చలాన్ల ద్వారా ఆదాయం రాబట్టాలని లక్ష్యాలు (Targets) నిర్దేశించుకోవడం సరికాదని కోర్టు తప్పుబట్టింది. మద్యం వల్ల కలిగే అనర్థాలను మహాత్మా గాంధీ, అబ్రహం లింకన్, థామస్ ఎడిసన్, జార్జ్ బెర్నార్డ్ షా లాంటి మహనీయులు మద్యపానం ఎంత ప్రమాదకరమో ఏనాడో హెచ్చరించారని సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక పాత తీర్పును కోర్టు గుర్తుచేసింది.
సీజ్ చేయొద్దు.. మరి పోలీసులు ఏం చేయాలి?
బండిని సీజ్ చేయకుండా పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలు పాటించాలని కోర్టు సూచించింది:
* తాగిన వ్యక్తిని డ్రైవింగ్ చేయనివ్వకూడదు.
* తోడుగా వచ్చిన వారికి (డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే) బండి అప్పగించాలి.
* ఎవరూ లేకపోతే బంధువులకు ఫోన్ చేసి పిలిపించాలి.
* వారు కూడా రాకపోతేనే, బండి రోడ్డు మీద ఉంటే ప్రమాదం కాబట్టి దగ్గర్లోని పోలీస్ స్టేషన్లో **’తాత్కాలిక సేఫ్ కస్టడీ’**లో ఉంచాలి (జప్తు చేయకూడదు).
పోలీసుల తీరు: చలాన్లు, సీజ్లతోనే సరిపెడుతున్నారా?
క్షేత్ర స్థాయిలో ట్రాఫిక్ పోలీసుల తీరుపై ఎప్పటినుంచో విమర్శలున్నాయి. కేవలం చలాన్లు విధించడం, బండ్లను సీజ్ చేసి యజమానులను పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిప్పుకోవడం ద్వారానే ప్రజల్లో భయం వస్తుందని వారు నమ్ముతున్నారు. పైగా పోలీసు ఉన్నతాధికారులు కూడా అవగాహన కల్పించడం కంటే, చలాన్ల ద్వారా వసూళ్లు పెంచడంపైనే దృష్టి పెడుతున్నారని కోర్టు సైతం గతంలో తప్పుబట్టింది.
కఠినంగా ఉన్నా.. తగ్గని ప్రమాదాలు
పోలీసులు ఇన్నాళ్లు వాహనాలను స్వాధీనం చేసుకుంటూ చాలా కఠినంగానే వ్యవహరించారు. అయినా సరే, పూర్తి స్థాయిలో డ్రంక్ అండ్ డ్రైవ్‌లను అరికట్టలేకపోతున్నారు. విస్మయం కలిగించే వాస్తవం ఏమిటంటే, పోలీసుల ఇంతటి కఠిన వైఖరి తర్వాత కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలను నిర్మూలించలేకపోయారు. భయం అనేది బండి సీజ్ చేస్తే వచ్చేది కాదని, అది వ్యక్తిగత బాధ్యత అని ఈ పరిమాణాలు చెబుతున్నాయి.
“బండి పోదులే” – పెరగనున్న బరితెగింపు!..?
ఈ నేపథ్యంలో రోడ్డు భద్రతా నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. “ఇకపై డ్రంక్ అండ్ డ్రైవ్ బండ్లను జప్తు చేయరు, కోర్టు కూడా మన పక్షానే ఉంది” అనే ధీమాతో మందుబాబులు మరింత బరితెగించే ప్రమాదం ఉంది. వాహనం సీజ్ అవుతుందన్న ఒకే ఒక్క భయంతో క్యాబ్‌లు బుక్ చేసుకునేవారు.. మందుబాబులకు ఇంతకాలం జైలు శిక్ష కంటే “నా బైక్/కారు పోతుంది, స్టేషన్ చుట్టూ తిరగాలి” అన్న భయమే ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఆ ఆయుధాన్ని కోర్టు పోలీసుల చేతుల్లోంచి తీసేసింది. ఇప్పుడు “దొరికినా వేరేవాళ్ళను పిలిచి బండి ఇప్పించుకోవచ్చులే” అనే నిర్లక్ష్యంతో మళ్లీ స్టీరింగ్ పట్టుకునే ముప్పు కనిపిస్తోంది. తీర్పులోని మార్గదర్శకాలు ప్రాక్టికల్‌గా బెడిసికొట్టే ప్రమాదం ఉంది. తనిఖీల్లో దొరికిన వ్యక్తి తన స్నేహితుడికి ఫోన్ చేసి పిలిపించి, లైసెన్స్ చూపించి బండి విడిపించుకుంటాడు. అక్కడినుంచి అర కిలోమీటరు వెళ్లాక.. ఆ స్నేహితుడు మళ్లీ బండిని తాగి ఉన్న వ్యక్తికే ఇచ్చి వెళ్లిపోతే పరిస్థితి ఏంటి? ఆ తర్వాత వాడు యాక్సిడెంట్ చేస్తే ప్రాణాలు పోయేది అమాయకులవే కదా అన్నది రోడ్డు భద్రతా నిపుణుల ఆవేదన. ఒకవేళ మద్యం తాగి వారం నడుపుతున్న వ్యక్తి యొక్క సంబంధికులు ఎవరు రాణి పక్షంలో వాహనాన్ని సేఫ్ కస్టడీలో ఉంచడం అనేది పోలీసులకు మరో భారం.
తీర్పు వల్ల కలిగే లాభాలు
ఆస్తి హక్కుల రక్షణ: ఎవరికో బండి ఇస్తే, వారు తాగి దొరికినందుకు యజమాని బండిని కోల్పోయి, అన్యాయంగా శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి తప్పుతుంది.
వేధింపులకు చెక్: స్టేషన్లలో బండ్లను వానకు తడుపుతూ, ఎండకు ఎండుతూ వదిలేయడం, తిరిగి ఇచ్చేందుకు పోలీసులు ఇబ్బంది పెట్టడం లాంటి సమస్యలకు చెక్ పడుతుంది. రూల్స్ పేరుతో సామాన్యులను ఇబ్బంది పెట్టడం, బండి తిరిగి ఇవ్వడానికి కోర్టుల చుట్టూ తిప్పించుకోవడం లాంటివి ఇకపై కుదరవు. ఆర్సీ, లైసెన్స్ చూపించగానే బండి ఇవ్వాల్సిందే.
ఇబ్బందులు ఏమిటంటే..?
నిర్భయం: వాహనం జప్తు అనే అతిపెద్ద శిక్ష లేకపోవడం వల్ల నేర ప్రవృత్తి, రిపీట్ అఫెండర్స్ సంఖ్య పెరుగుతుంది.
లూప్ హోల్స్ వాడుకోవడం: ఒకసారి పోలీసులకు పట్టుబడినా, వేరొకరితో బండి తెప్పించుకుని, మళ్లీ పక్క వీధిలో తాగి ఉన్న వ్యక్తే డ్రైవింగ్ సీట్లో కూర్చునే ప్రమాదం చాలా ఎక్కువ. ఇది రోడ్డుపై వెళ్లే అమాయకుల ప్రాణాలకు సంకటంగా మారుతుంది.
కార్యకలాపాలకు ఆటంకం: పోలీసులు ప్రతి కేసుకు బంధువులకు ఫోన్ చేసి, వారు వచ్చేదాకా రోడ్లపై పడిగాపులు కాయడం, లేదంటే బండిని సురక్షితంగా తీసుకెళ్లి స్టేషన్లో పెట్టడం ప్రాక్టికల్‌గా ట్రాఫిక్ పోలీసులకు తీవ్ర తలనొప్పిగా మారుతుంది.
మరి ఏం చేయాలి..?
హైకోర్టు తీర్పును గౌరవించాల్సిందే.. పోలీసులు తీర్పును అమలు పరచాల్సిందే. చట్టంలో లేని అధికారాన్ని కాకుండా ఉన్న చట్టాలను అమలు చేయాలని కోర్టు స్పష్టంగా పేర్కొంది. లేని అధికారాన్ని పోలీసులు చెలాయించకూడదు. అయితే మందుబాబులకు ఈ తీర్పు ఒక ఆయుధం కాకుండా చూడాలంటే ప్రభుత్వం చట్టాలను సవరించాలి. బండ్లను సీజ్ చేయడానికి బదులుగా, లైసెన్స్‌లను శాశ్వతంగా రద్దు చేయడం, భారీ జరిమానాలు విధించడం, జైలు శిక్షలను కఠినంగా అమలు చేయడం లాంటి చర్యలు తీసుకోవాలి. అప్పుడే పౌరుల ఆస్తులకు రక్షణ, రోడ్డుపై ప్రాణాలకు భద్రత దక్కుతుంది.
భయపెడుతున్న NCRB డేటా
“జాతీయ నేర రికార్డుల బ్యూరో (NCRB) డేటా అనుసరించి తెలంగాణలో డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా వందల మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.
2019 NCRB నివేదిక: ఈ సంవత్సరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ మరణాల్లో ఉత్తరప్రదేశ్ (849 మరణాలు), జార్ఖండ్ (413), మధ్యప్రదేశ్ (199) తొలి మూడు స్థానాల్లో ఉండగా, తెలంగాణ 177 మరణాలతో దేశంలో 4వ స్థానంలో నిలిచింది.
2020 NCRB నివేదిక: కేవలం ఒక్క ఏడాదిలోనే పరిస్థితి తీవ్రంగా మారి, డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల తెలంగాణలో ఏకంగా 343 మరణాలు సంభవించాయి. దీంతో ఈ మరణాల్లో ఉత్తరప్రదేశ్ తర్వాత తెలంగాణ దేశంలోనే 2వ స్థానంకు చేరుకుంది. జరిమానాలు, జైలు శిక్షలు, బండ్ల జప్తులు అమలు చేస్తున్నా ఈ స్థాయిలో ప్రమాదాలు జరుగుతుండటం వ్యవస్థ వైఫల్యానికి అద్దం పడుతోంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.”
ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను చాలా కఠినంగానే అమలు చేస్తు, వేల రూపాయల జరిమానాలు, వాహనాల జప్తు, కోర్టుల ద్వారా జైలు శిక్షలు విధిస్తున్నప్పటికీ.. మరణాల సంఖ్య ఈ స్థాయిలో ఉండటం నిజంగా ఆందోళనకరం. చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా, మందు తాగి వాహనం నడపకూడదనే కనీస బాధ్యత పౌరుల్లో లోపించడం , వ్యవస్థాగతంగా ఇంకా పకడ్బందీ చర్యలు అవసరమన్న చేదు నిజాన్ని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

