మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా నిజాంపేట్, ప్రగతి నగర్ ప్రాంతాల్లో అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ భూములను కాపాడాలని ప్రజావాణిలో ఆకుల సతీష్ ఫిర్యాదు చేశారు.
| Akula Satish Demands to Protect Govt Lands in Medchal |
* మెడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో ప్రభుత్వ భూముల కబ్జాపై ‘ప్రజావాణి’లో ఫిర్యాదు.
* నిజాంపేట్‌లో 14 ఎకరాల అసైన్డ్ భూమిలో వెలిసిన అక్రమ వెంచర్లు, నిర్మాణాలు.
* ప్రగతి నగర్లో సర్వే నంబర్ మార్చి ఏకంగా హెచ్ఎండీఏ (HMDA) అనుమతులు.
* ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆకుల సతీష్ డిమాండ్.
లోకల్ వైబ్స్, నిజాంపేట్: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో ప్రభుత్వ భూములు భారీ స్థాయిలో అన్యాక్రాంతం అవుతున్నాయని, వాటిని తక్షణమే కాపాడాలని సామాజిక కార్యకర్త ఆకుల సతీష్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం ఆయన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో అధికారులకు ఫిర్యాదు చేశారు. నిజాంపేట్, ప్రగతి నగర్ పరిధిలో జరుగుతున్న భూకబ్జాల వివరాలను ఆయన అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
*నిజాంపేట్‌లో 14 ఎకరాల అసైన్డ్ భూమిలో అక్రమ వెంచర్*
నిజాంపేట్ పరిధిలోని సర్వే నెం. 233/22, 24, 25, 26, 27 లలో 1964–65 సంవత్సరాల్లో సుమారు 14 ఎకరాల లావణ్య పట్టా భూమిని కొంతమంది రైతులకు వ్యవసాయం కోసం ప్రభుత్వం కేటాయించింది. అయితే, ఆ అసైన్ రైతులు అధికారుల నుంచి ఎలాంటి ఎన్వోసీ (NOC) పొందకుండానే, 2008లో ఈ భూమిని అక్రమంగా వెంచర్‌గా మార్చి ప్లాట్లుగా విక్రయించారు.ఈ అక్రమాలపై స్పందించిన అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్, 2010లో ఆ భూమి బదిలీలను, ప్లాట్ల రిజిస్ట్రేషన్లను రద్దు చేశారు. ఈ అంశంపై ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు (WP: 34867/2011, WPMP No. 3586/2014 & WA No. 191822/2014). అయితే, సంబంధిత అధికారులు సరైన కౌంటర్ దాఖలు చేయడంలో నిర్లక్ష్యం వహించడంతో కేసు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్లిందని సతీష్ ఆరోపించారు. దీనిని ఆసరాగా చేసుకుని, గత 5 రోజులుగా కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఆ భూమిని చదును చేసి, అక్రమ నిర్మాణ పనులు కూడా ప్రారంభించారని ఆయన మండిపడ్డారు.

*ప్రగతి నగర్లో సర్వే నంబర్ మార్చి ‘గిఫ్ట్ డీడ్’ల బాగోతం*
మరోవైపు ప్రగతి నగర్‌లోని సర్వే నెం. 186లో ఉన్న సుమారు 15 గుంటల ప్రభుత్వ భూమిని పక్కనే ఉన్న సర్వే నెం. 182గా చూపిస్తూ అక్రమంగా ప్లాట్లుగా రిజిస్ట్రేషన్ చేశారని సతీష్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ భూమిని ఓ పార్టీ కి చెందిన రాష్ట్ర కార్యదర్శి పేరిట గిఫ్ట్ డీడ్ ద్వారా బదిలీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని ఆయన తెలిపారు. అంతేకాకుండా, ఏకంగా ప్రభుత్వ భూమిలోనే నిర్మాణాల కోసం హెచ్ఎండీఏ (HMDA) అనుమతులు కూడా పొందడం గమనార్హం.
*సర్వేలో ప్రభుత్వ భూమిగా..*
దీనిపై స్థానికులు ఇప్పటికే ఫిర్యాదు చేయగా, అధికారులు సర్వే నిర్వహించి అది ప్రభుత్వ భూమి అని నిర్ధారించారు. కానీ, ఆక్రమణదారులపై ఇప్పటివరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదని సతీష్ విమర్శించారు. ప్రభుత్వ భూములు ప్రజల ఆస్తి అని, వాటిని కాపాడటం అధికారుల ప్రాథమిక బాధ్యత అని సతీష్ స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి కింది చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
నిజాంపేట్ 14 ఎకరాల ప్రభుత్వ భూమిలో జరుగుతున్న ఆక్రమణలను, నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలి. హైకోర్టులో తక్షణమే అప్పీల్ పిటిషన్ దాఖలు చేయాలనీ, ఆ భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని మినీ స్టేడియం, హాస్పిటల్ లేదా జూనియర్ కాలేజ్ వంటి ప్రజాప్రయోజనాల కోసం వినియోగించాలనీ, ప్రగతి నగర్ సర్వే నెం. 186లోని ప్రభుత్వ భూమిని వెంటనే స్వాధీనం చేసుకోవాలనీ, ఆ భూమిలో నిర్మాణాలు చేపట్టేందుకు హెచ్ఎండీఏ ఇచ్చిన అక్రమ అనుమతులను తక్షణమే రద్దు చేయాలనీ, ప్రభుత్వ భూములను కబ్జా చేసిన, అందుకు సహకరించిన బాధ్యులందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలనీ ఆకులు సతీష్ ఫిర్యాదు పత్రంలో పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆకుల సతీష్‌తో పాటు పాండు, ఎల్లస్వామి తదితరులు పాల్గొన్నారు.

