HomeCUREవెన్నెలగడ్డ లో వైన్ షాప్ ఉన్న అక్రమ కట్టడానికి రెడ్ కార్పెట్..?

వెన్నెలగడ్డ లో వైన్ షాప్ ఉన్న అక్రమ కట్టడానికి రెడ్ కార్పెట్..?

Date: Posted By : LOCAL VIBES

Copyright © 2026 LOCAL VIBES. All rights reserved.

సుచిత్ర-కుత్బుల్లాపూర్ రహదారి వెన్నెల గడ్డ లోని బాట షోరూం సమీపంలో, నివాసాల మధ్య వెలిసిన ఈ అక్రమ నిర్మాణంపై స్థానికులు నెల రోజులుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా.. కనీస స్పందన కరువైంది. ఏకంగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలను, స్వయంగా జీహెచ్ఎంసీ కమిషనర్ జారీ చేసిన సర్క్యులర్‌ను సైతం స్థానిక అధికారులు బేఖాతర్ చేయడం అధికారుల ఉదాసీనతకు అద్దం పడుతోంది. కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటూ, కూల్చివేత లేదా సీజింగ్ చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

_ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) పరిధిలోని వెన్నెలగడ్డలో నిబంధనలకు విరుద్ధంగా..

_ అక్రమంగా నిర్మించిన తాత్కాలిక షెడ్డులో వైన్ షాపు ఏర్పాటు పై..

_ మార్చి 09, 2026న ఎక్సైజ్ మరియు మున్సిపల్ అధికారులకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన స్థానికులు..

_ ప్రజావాణిలో పదే పదే మొరపెట్టుకున్నా అధికారుల నుంచి శూన్య స్పందన..

_ అనేక పర్యాయాలు ఫిర్యాదుతో ఇప్పుడు.. నోటీసుల పేరుతో నాన్చుడు ధోరణి..

_ మార్చి 16, 2026న షోకాజ్ నోటీసు (12946/C55/TPS/UC/2026) ఇచ్చి చేతులు దులుపుకున్న జీడిమెట్ల సర్కిల్-55 టౌన్ ప్లానింగ్ అధికారులు..?

_ ఏప్రిల్ 06, 2026న ఫైనల్ నోటీసు (12946/UC/2026) ఇచ్చి, కూల్చివేతకు మరో 15 రోజుల గడువు ఇస్తూ అక్రమార్కులకు అండగా అధికారులు..?

జీడిమెట్ల సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులపై తీవ్ర విమర్శలు చేస్తున్న స్థానికులు

అక్రమ నిర్మాణాలను తక్షణమే సీజ్ చేయాలనే హైకోర్టు ఆదేశాలు (WP No.12889/2025) బేఖాతర్..?

_ హైకోర్టు ఆదేశాల అమలుకై అప్పటి జీహెచ్ఎంసీ కమిషనర్ జారీ చేసిన సర్క్యులర్‌ (నెం.375296)ను సైతం ఖాతరు చేయని జీడిమెట్ల సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు..

_ కేవలం నామమాత్రంగా నోటీసులు ఇచ్చి, తదుపరి కఠిన చర్యలు తీసుకోకుండా సిఎంసీ అధికారులు కాలయాపన..?

_ ఫైనల్ గా అక్రమ నిర్మాణం తొలగించాలి అంటూ 15 రోజులు గడువు నోటీసు పై అనుమానాలు..

_ ఈ లోపల కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటానికి అవకాశం ఇస్తున్నారా అనే ప్రశ్న..?

_ తాత్కాలిక షెడ్లు, నివాస ప్రాంతంలో మద్యం విక్రయాలు నిషిద్ధమన్న హైకోర్టు తీర్పు (WP 7123/2022) ఉల్లంఘన పై పట్టింపు ఏది…?

_ నివాస ప్రాంతాల్లో పర్మిట్ రూమ్స్ న్యూసెన్స్‌పై (పిల్ WP 64/2017) స్పష్టమైన కోర్టు తీర్పు ఉన్నప్పటికీ పట్టించుకోని ఎక్సైజ్ శాఖ..

లోకల్ వైబ్స్, సుచిత్ర: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కుత్బుల్లాపూర్ జోన్, జీడిమెట్ల (సర్కిల్-55) టౌన్ ప్లానింగ్ అధికారుల తీరు తీవ్ర విమర్శల పాలవుతోంది. సామాన్యుడు చిన్న ఇటుక పేర్చితే నిబంధనల పేరుతో వాలిపోయే అధికారులు, బడా బాబులు ఏకంగా అక్రమంగా రేకుల షెడ్డు వేసి, అందులో మద్యం దుకాణం నిర్వహిస్తున్నా చోద్యం చూస్తున్నారు. గత నెల రోజులుగా అనేకమార్లు ఇట్టి అక్రమ నిర్మాణం పై ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని వాపోతున్నారు అక్కడే స్థానికులు. అక్రమ కట్టడానికి రెడ్ కార్పెట్ వేసి మరి కుత్బుల్లాపూర్ టౌన్ ప్లానింగ్ అధికారులు సహకరిస్తున్నారా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అక్రమ నిర్మాణం చేయడమే కాకుండా దానిలో ఏర్పాటు చేయనున్న మద్యం దుకాణం ను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక మహిళలు… ఫైల్ ఫోటో..

ఫిర్యాదు ఇచ్చి నెల రోజులు గడిచిన…

సుచిత్ర-కుత్బుల్లాపూర్ రహదారి వెన్నెల గడ్డ లోని బాట షోరూం సమీపంలో, నివాసాల మధ్య వెలిసిన ఈ అక్రమ నిర్మాణంపై స్థానికులు నెల రోజులుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా.. కనీస స్పందన కరువైంది. ఏకంగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలను, స్వయంగా జీహెచ్ఎంసీ కమిషనర్ జారీ చేసిన సర్క్యులర్‌ను సైతం స్థానిక అధికారులు బేఖాతర్ చేయడం అధికారుల ఉదాసీనతకు అద్దం పడుతోంది. కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటూ, కూల్చివేత లేదా సీజింగ్ చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ నిర్మాణం పూర్తికాకముందే సదరు నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్థానికులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం కూడా చేపట్టారు.

అక్రమ నిర్మాణం, వైన్ షాపు ఏర్పాటు పై నిరసన వ్యక్తం చేస్తున్న స్థానికులు.. ఫైల్ ఫోటో.

స్థానికుల అభ్యంతరాలు బుట్టదాఖలా.. నోటీసుల పేరిట నాటకాలు!..?

సుచిత్ర ఎల్.జి క్లాసిక్ అపార్ట్‌మెంట్ పక్కన ఎలాంటి భవన నిర్మాణ అనుమతులు లేకుండా ఓ వ్యక్తి రేకుల షెడ్డు వేసి అందులో వైన్ షాపు ఏర్పాటు చేశారు. దీనిపై మార్చి 9 న స్థానికులు స్థానిక ఎక్సైజ్ కార్యాలయం అదేవిధంగా, జీడిమెట్ల సర్కిల్ కార్యాలయంలో పూర్తి వివరాలు పేర్కొంటూ ఫిర్యాదు ఇచ్చారు. ఈ విషయంపై ప్రతి సోమవారం ప్రజావాణిలో జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్లకు మొరపెట్టుకున్నారు. అయితే అధికారులు స్థానికుల ఫిర్యాదులను అభ్యంతరాలను ఏమాత్రం పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి.

ఫిర్యాదు చేసిన అనంతరం అక్రమ నిర్మాణం పై అధికారులు జారీచేసిన నోటీసులు..

నోటీసులో పేరిట సాగదీత..

దీంతో గత్యంతరం లేక అధికారులు మార్చి 16న మొదటి షోకాజ్ నోటీసు (No: 12946/C55/TPS/UC/2026) జారీ చేశారు.ఆ తర్వాత గడువు ముగిసినా చర్యలు తీసుకోలేదు. తిరిగి ఏప్రిల్ 06, 2026న మరో ఫైనల్ నోటీసు (నం. 12946/UC/2026) జారీ చేసి, ‘మీరే కూల్చేయండి, లేదంటే మేమే కూల్చేస్తాం’ అంటూ ఇంకో 15 రోజులు గడువు పెంచారు. అయితే, ఇదంతా కేవలం పైకి కనిపిస్తున్న డ్రామానే అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నోటీసు ఇచ్చి రోజులు గడుస్తున్నా, ఇప్పటివరకు సంబంధిత అధికారులు ఆ అక్రమ షెడ్డును కూల్చివేయడానికి కనీస ప్రయత్నం చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అధికారుల ఉదాసీనతతో నిర్మాణదారుడు నిర్మాణం పూర్తి చేయడమే కాకుండా అందులో మద్యం దుకాణం నిర్వహణ జరుగుతుందని అక్కడి వారు వాపోతున్నారు.

వెన్నెలగడ్డ లో వైన్ షాపు ఉన్న అక్రమ నిర్మాణాన్ని తొలగించాలని కోరుతూ ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన స్థానికులు..

హైకోర్టు ఆదేశాలకు విలువేదీ..?.. కమిషనర్ సర్క్యులర్‌పై పట్టింపు ఏది ..?

అక్రమ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు (WP No.12889 of 2025) అత్యంత స్పష్టమైన తీర్పునిచ్చింది. అక్రమ నిర్మాణాలపై షోకాజ్ నోటీసు ఇచ్చిన వెంటనే, తదుపరి విచారణ పూర్తయ్యే వరకు సదరు నిర్మాణాన్ని తక్షణమే “సీజ్” చేయాలని (Forthwith seal the unauthorized structures) కోర్టు కరాఖండిగా తేల్చి చెప్పింది. ఈ కోర్టు తీర్పును ఉటంకిస్తూ, అప్పటి జీహెచ్ఎంసీ కమిషనర్ మే 1, 2025న ఒక ప్రత్యేక సర్క్యులర్ (No.375296/TPS/HO/GHMC/2025/732) జారీ చేశారు. నోటీసులు ఇచ్చిన వెంటనే తదుపరి ఎంక్వయిరీ పెండింగ్ లో ఉన్నప్పటికీ సంబంధిత నిర్మాణాన్ని సీజ్ చేయాలని, ఈ ఆదేశాలు ఉల్లంఘిస్తే డిప్యూటీ కమిషనర్లు, ఏసీపీలు, టీపీఎస్ లపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు ఉంటాయని ఆ సర్క్యులర్ లో హెచ్చరించారు. మరి వెన్నెలగడ్డ కేసులో నోటీసులు ఇచ్చిన జీడిమెట్ల డిప్యూటీ కమిషనర్ గానీ, టౌన్ ప్లానింగ్ అధికారులు గానీ ఈ రేకుల షెడ్డును ఎందుకు సీజ్ చేయలేదు? హైకోర్టు తీర్పు తో పాటుగా, అప్పటి తమ బాస్ ఆదేశాలను సైతం లెక్కచేయకపోవడం వెనుక దాగి ఉన్న ఆంతర్యం ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు ఫిర్యాదుదారులు.

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలతో అక్రమ నిర్మాణాలపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సూచిస్తూ అప్పటి జిహెచ్ఎంసి కమిషనర్ జారీ చేసిన సర్కులర్…

ఇస్తున్న గడువుపై అనుమానాలు..?

సదరు అక్రమ నిర్మాణంపై స్థానికులు మార్చి 9న ఫిర్యాదు చేశారు. అప్పటికే నిర్మాణం దాదాపుగా పూర్తయింది. కాగా అక్రమ నిర్మాణాలపై ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిశీలన చేసి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు, జీడిమెట్ల టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఫిర్యాదు చేసిన అక్రమ నిర్మాణం పై ఏమాత్రం దృష్టి సారించలేదు. స్థానికుల ఫిర్యాదు ఇచ్చిన కొన్ని రోజులకు నోటీసులు ఇస్తూ కాలం వెళ్ళదీస్తున్నారు అనే విమర్శలు ఉన్నాయి. అయితే గడువు ఇస్తు వస్తున్న అధికారుల తీరుపై అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తాజాగా అక్రమ తొలగించాలి అని, లేని పక్షంలో స్వయంగా తొలగించాల్సి ఉంటుందని, 15 రోజుల్లో చర్యలు తీసుకోవాలని ఆఖరి గడువు ఇచ్చారు. అయితే ఈ లోపల అక్రమ నిర్మాణదారుడు కోర్టుకు వెళ్లి అధికారులు చర్యలు తీసుకోకుండా స్టే తెచ్చుకునేందుకు వీలుగా ఇలా గడువులు ఇస్తున్నారు అనే విమర్శలు ఉన్నాయి. గతంలో కూడా ఇదే సుచిత్ర కుత్బుల్లాపూర్ ప్రధాన రహదారిలో ఓ వ్యక్తి అక్రమ నిర్మాణం పై ఇదేవిధంగా కోర్టుకు వెళ్లి తన అక్రమ నిర్మాణం పై అధికారులు చర్యలు తీసుకోకుండా ఆర్డర్ తెచ్చుకున్నాడు. దీంతో కోర్టు ఆర్డర్ ఉంది మేము ఏమి చేయాలని అని అధికారులు చెప్పుకోవచ్చారు. ఇదే కోవలో ఇప్పుడు ఈ అక్రమ నిర్మాణంపై కూడా జరుగుతుందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.

అక్రమ నిర్మాణానికి ఇచ్చిన నోటీసులు.. స్వచ్ఛందంగా తొలగించాలి అంటూ 15 రోజులు గడువు ఇచ్చినట్లుగా చూపిస్తున్న దస్త్రం…

అధికారుల జవాబుదారీతనం ఏది?.. సామాన్యుల సూటి ప్రశ్నలు

ఈ వ్యవహారంలో ఎక్సైజ్, పోలీస్, మున్సిపల్ యంత్రాంగం ఉదాసీనతపై స్థానికులు పలు సూటి ప్రశ్నలు సంధిస్తున్నారు.

1. ప్రజా ప్రయోజన వ్యాజ్యం (WP 64/2017) లో “ప్రజలు నివసించే ప్రదేశాల్లో కాకుండా, వ్యాపార కార్యకలాపాలు జరిగే ప్రదేశాల్లో నే మద్యం దుకాణాలు ఉండాలి” అనే ఆదేశాలు ప్రకారం సదరు ప్రాంగణం ‘నివాస ప్రాంతం’ (Residential)లో ఉందా లేక ‘వాణిజ్య ప్రాంతం’ (Commercial)లో ఉందా అని అధికారులు ఏ ప్రాతిపదికన నిర్ధారించారు?. “కామర్షియల్ ఏరియా” అని చెప్పినా, చుట్టూ నివాసాలు ఉంటే అనుమతించరాదని కోర్టు స్పష్టం చేసింది. ఈ అంశాన్ని ఇటు సర్కిల్ అధికారులు గానీ అటు ఎక్సైజ్ అధికారులు గానీ పరిగణంలోకి తీసుకున్నారా..?

2. Wp No. 7123 of 2022 (Shaik Jameer vs State of Telangana) కేసులో అపార్ట్‌మెంట్లు, నివాస ప్రాంతాల మధ్యలో ఉన్న వైన్ షాప్‌ను కోర్టు తప్పుగా భావించి, ఒక నెలలో ఇతర ప్రదేశానికి మార్చాలని ఆదేశించింది. ఈ క్రమంలో ప్రస్తుతం స్థానికులు ఫిర్యాదు చేస్తున్న అక్రమ నిర్మాణంలో నడుస్తున్న వైన్ షాపు అపార్ట్మెంట్స్, రెసిడెన్స్ కు అతి దగ్గరగా ఉంది. మరి ఈ ఆదేశాలను అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు..?

3. తాత్కాలిక షెడ్డుకు జీహెచ్ఎంసీ/సీఎంసీ నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ (OC), వాణిజ్య భవన అనుమతి పత్రాలు (Sanctioned Plan) లేకుండానే, స్థానికుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండానే ఎక్సైజ్ శాఖ లైసెన్స్ ఇస్తుందా?.

4. అసలు అక్రమ నిర్మాణం పై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలను అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు?. స్థానికులు ఇంత మేర అభ్యంతరాల వ్యక్తం చేస్తున్న సదరు అక్రమ షెడ్డు నిర్మాణంలో వైన్స్ దుకాణం కు ఎన్ఓసీలు ఏ విధంగా మంజూరు అయ్యాయి?.

5. తెలంగాణ ఎక్సైజ్ రూల్ ప్రకారం లైసెన్సింగ్ అథారిటీ వాటిని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు?

6. అక్రమ నిర్మాణం పూర్తి అవ్వకముందే అంటే మార్చి 9న స్థానికులు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో జీడిమెట్ల సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఎందుకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోలేకపోయారు..?

7. ఎప్పటికప్పుడు అక్రమ నిర్మాణాలపై పర్యవేక్షణ జరిపి రిపోర్ట్ చేయాల్సిన టౌన్ ప్లానింగ్ కిందిస్థాయిస్తే ఇబ్బంది ఏం చేస్తున్నట్లు..?

8. కిందిస్థాయి సిబ్బంది పై అధికారులకు ఈ అక్రమ నిర్మాణం పై తెలియజేయలేదే అనుకుందాం.. కానీ ఫిర్యాదు రూపంలో స్థానికులు కంప్లైంట్ చేసిన తర్వాత నైనా చర్యలు తీసుకొని ఉంటే ఇప్పుడు ఆ అక్రమ నిర్మాణం పూర్తయ్యేది కాదు. మరి సదరు అక్రమ నిర్మాణం విజయవంతంగా పూర్తయిన అంశంపై ఏ అధికారి బాధ్యత తీసుకుంటాడు..?

9. ఫిర్యాదు ఇచ్చిన తర్వాత తాపీగా టౌన్ ప్లానింగ్ అధికారు లు నోటీసులు ఇస్తున్నాం, ఇప్పుడు ఫైనల్ నోటీసు ఇచ్చాం అంటూ

తదితర ప్రశ్నలకు సదరు అక్రమ నిర్మాణం పై కంప్లైంట్ చేస్తున్న ఫిర్యాదుదారులకు, అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న వారికి అధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిబంధనలకు విరుద్ధంగా, కోర్టు ధిక్కరణకు పాల్పడుతూ వెలస్తున్న ఈ అక్రమ తాత్కాలిక వైన్ షాపు షెడ్డును మున్సిపల్ అధికారులు తక్షణమే కూల్చివేయాలి అనీ, ఎక్సైజ్ శాఖ తక్షణమే స్పందించి లైసెన్స్ రద్దు చేయాలి అని, లేనిపక్షంలో న్యాయస్థానం దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకెళ్తామని, అధికారులపై న్యాయపోరాటం చేస్తామని స్థానిక ప్రజలు హెచ్చరిస్తున్నారు. కాగా స్థానికులు ప్రతి ప్రజావాణిలో ఆధారాలతో మొత్తుకుంటున్నా పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్న అధికారుల తీరుపై ఉన్నతాధికారులు, ప్రభుత్వం తక్షణమే స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

వెన్నెల గడ్డలో అక్రమ నిర్మాణం జరుగుతున్న సందర్భంలోనే ఆ నిర్మాణాన్ని, అందులో ఏర్పాటు చేయబోతున్న మద్యం దుకాణాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేస్తున్న స్థానికులు.. ఫైల్ ఫోటో..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments