HomeCURE”సీజింగ్”లతోనే సరి..!.. తర్వాత ఇక “రిలీజింగ్” లే..?

”సీజింగ్”లతోనే సరి..!.. తర్వాత ఇక “రిలీజింగ్” లే..?

Date: Posted By : LOCAL VIBES

Copyright © 2026 LOCAL VIBES. All rights reserved.

దుండిగల్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఫిబ్రవరి నెలలో అక్రమ నిర్మాణాలంటూ సీజ్ చేసిన భవన నిర్మాణాలు ఒకవైపు పూర్తి కావస్తుండగా.. తాజా గా సోమవారం మరోసారి అక్రమ భవనాలు అంటూ అధికారులు మూడు నిర్మాణాలను సీజ్ చేయటం జరిగింది.

సీజింగ్”లతోనే సరి.. తర్వాత ఇక “రిలీజింగ్” లే..?

_ దుండిగల్ టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు..

_ అక్రమ నిర్మాణాల సీజింగ్ లపై ప్రెస్ నోట్లకే పరిమితమైన అధికారులు..

_ ఫిబ్రవరిలో సీజ్ చేసిన భవనాలు ఇప్పుడు ముగింపు దశలో..

_ అడ్డుకునే నాథుడే లేడు.. పట్టించుకునే పాపాన పోని సిబ్బంది..

_ దృష్టికి తీసుకువచ్చిన బుట్టదాఖలే.. చర్యల నివేదికలపై స్పందన కరువు..

_ ఆర్టీఐ (RTI) దరఖాస్తులకు సంబంధం లేని కాపీ పేస్ట్ సమాధానాలు..

_ తాజాగా ‘మళ్లీ సీజ్ చేశామంటూ’ అదే తరహా నాటకానికి కొత్త తెర….?

_ కేవలం రికార్డుల కోసమేనా..?, లేక ఇంకెందు కోసమేననా..? అని స్థానికుల ప్రశ్న..

_ విధుల్లో చిత్తశుద్ధి ఏదీ.. నిన్నటి చోద్యం చూస్తు వచ్చిన ఉన్నతాధికారులు!..

_ నూతన డిప్యూటీ కమిషనర్ అయిన టౌన్ ప్లానింగ్ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్..

లోకల్ వైబ్స్, దుండిగల్: మొదట హడావిడి.. ఆ తర్వాత అంతా సైలెంట్. నిబంధనలు ఉల్లంఘించిన భవనాలంటూ ఆర్భాటంగా సీజింగ్ ప్రక్రియలు.. అనంతరం, ఫోటోలకు ఫోజులిచ్చి…ప్రెస్ నోట్లు విడుదల చేస్తారు. కానీ, ఆ తర్వాత ఆ భవనాల్లో పనులు యథేచ్ఛగా కొనసాగుతున్నా అటు వైపు కన్నెత్తి కూడా చూడరు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సిఎంసీ) కుత్బుల్లాపూర్ జోన్, దుండిగల్ సర్కిల్-59 లో టౌన్ ప్లానింగ్ అధికారుల తీరు చూస్తుంటే.. ఈ ‘సీజ్’ల పర్వం ఎవరిని భయపెట్టడానికి? ఎవరిని ఉద్ధరించడానికి? అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ నిర్మాణాలపై కేవలం కంటితుడుపు చర్యలు చేపడుతూ, తాము విధులు నిర్వర్తించామని రికార్డుల్లో రాసుకోవడానికే అధికారులు ఈ డ్రామాలు ఆడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఫిబ్రవరి నాటి ‘సీజ్’ భవనాలు.. నేడు పూర్తి కావస్తు!

దుండిగల్ సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపించామంటూ గత ఫిబ్రవరి మొదటి వారంలో టౌన్ ప్లానింగ్ అధికారులు ఘనంగా ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. అనుమతించిన ప్లాన్ కు విరుద్ధంగా భవనాలు నిర్మిస్తున్నారని.. డీ. పోచంపల్లి లోని (స్టిల్ట్ + 2 కి అనుమతి ఉంటే, సెల్లార్+గ్రౌండ్+4 అంతస్తులు), (స్టిల్ట్+2 కి అనుమతి ఉంటే స్టిల్ట్+5), నిర్మిస్తున్న వాణిజ్య షెడ్డులను జీహెచ్ఎంసీ చట్టం 1955, సెక్షన్ 461-A ప్రకారం సీజ్ చేసినట్లు పత్రిక ముఖంగా ప్రకటించారు. కానీ ఆశ్చర్యకరంగా, నాడు సీజ్ కు గురైన ఆ భవనాలు నేడు దాదాపుగా నిర్మాణ పనులు పూర్తి చేసుకున్నాయి. సీజ్ చేసిన భవనాల్లో పనులు ఎలా జరుగుతున్నాయని స్థానికులు ప్రశ్నిస్తున్నా అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు.

గండి మైసమ్మ చౌరస్తా తాజా టిఫిన్స్ సమీపంలో గతంలో దుండిగల్ టౌన్ ప్లానింగ్ అధికారులు సీజ్ చేసినప్పటికీ… పూర్తయిన అక్రమ భవన నిర్మాణం…

ఫిర్యాదులు బేఖాతరు.. ఆర్టీఐకి ‘కాపీ పేస్ట్’ సమాధానాలు..

సీజ్ చేసిన భవనాల్లో యథేచ్ఛగా పనులు కొనసాగుతుండటంపై అధికారులకు ఎన్ని ఫిర్యాదులు చేసినా బుట్టదాఖలు చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో చర్యలు శూన్యం కావడంతో, అధికారులు తీసుకున్న ‘చర్యల నివేదిక (Action Taken Report)’ కోరుతూ సమాచార హక్కు చట్టం (RTI) కింద దరఖాస్తు చేసినా పరిస్థితిలో మార్పు లేదు. ఆర్టీఐ దరఖాస్తులకు జవాబుదారీతనంతో సమాధానం ఇవ్వాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు.. అసలు సమాచారాన్ని దాటవేస్తూ, ఏమాత్రం సంబంధం లేని కాపీ పేస్ట్ సమాచారాన్ని చేతిలో పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. దీనిని బట్టే దుండిగల్ సర్కిల్ లో అక్రమ నిర్మాణాల వెనుక ఎలాంటి తంతు నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు.

మళ్లీ ప్రెస్ నోట్ల హడావుడి.. ఈసారి సీజ్ అయిన భవనాలు ఇవే!

పాత సీజ్ ల ముచ్చట అలా ఉండగానే.. తాజాగా నిన్న (సోమవారం) మరోసారి అధికారులు అక్రమ భవనాలంటూ మరో ప్రెస్ నోట్ వదిలారు. డిప్యూటీ కమిషనర్ డా. ఎస్ వెంకట మణి కరన్ పర్యవేక్షణలో, ఏసీపీ శ్రీనివాస్, టౌన్ ప్లానింగ్ సిబ్బంది కలిసి తనిఖీలు చేశారట. బహదూర్‌పల్లిలోని టెక్ మహీంద్రా వెనుక వైపున్న భవనం, దుండిగల్ విశ్వసాయి టౌన్ షిప్ లోని షెడ్డు, బౌరంపేటలోని షాలోమ్ ఇంటర్నేషనల్ స్కూల్ వారు నిర్మిస్తున్న అక్రమ భవనాలను సీజ్ చేసినట్లు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం సీజింగ్ ఫోటోలను విడుదల చేశారు దుండిగల్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు.

ఓ ప్రైవేట్ స్కూల్ భవనాన్ని సీజ్ చేసిన దుండిగల్ సర్కిల్ అధికారులు..

కఠిన చర్యలు దిశగా కొత్త డిసి..

కాగా ఫిబ్రవరి నెలలో సీజైన నిర్మాణాల సమయంలో ఉన్న డిప్యూటీ కమిషనర్ స్థానంలో ప్రస్తుతం కొత్తగా డా. ఎస్ వెంకట మణి కరన్ డిప్యూటీ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన వచ్చిన తర్వాత మొదటిసారిగా క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్రమ భవనాలను సీజ్ చేయడం జరిగింది. అయితే గతంలో మాదిరిగా నామ్ కి వస్తేగా కాకుండా పక్కాగా చర్యలు తీసుకునే విధంగా సీజ్ ప్రక్రియ కొనసాగిందని చెబుతున్నారు. ఈ దఫాలో ఎట్టి పరిస్థితుల్లో అక్రమ నిర్మాణాలను ఉపేక్షించకుండా, ఆ విధంగా చర్యలు తీసుకునే విషయంలో వెనకడుగు వేయకుండా కొత్త డిప్యూటీ కమిషనర్ వ్యవహరిస్తారని ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు అక్కడివారు.

అనుమతులు లేకుండా నిర్మించిన భవనాన్ని సీజ్ చేసిన దుండిగల్ సర్కిల్ అధికారు లు…

సీజ్ లతో సరి.. ఆ తర్వాత ఇక లైట్?

ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే.. సీజ్ చేసిన భవనాల్లో నిర్మాణాలు జరగకుండా ఆపలేని పక్షంలో, అసలు ఈ సీజ్ ప్రక్రియలు ఎందుకు? కేవలం భవనం ముందు ఓ నోటీసు అంటించి, ఓ ఫోటో దిగి ప్రెస్ కు రిలీజ్ చేయడానికేనా? లేక బిల్డర్లను భయపెట్టి ఏం చేయాలని? ‘మేము సీజ్ చేశాం.. మా బాధ్యత అయిపోయింది, ఆ తర్వాత మాకు అనవసరం..’ అన్నట్లుగా వ్యవహరిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారుల తీరు తీవ్ర విమర్శల పాలవుతోంది. దుండిగల్ సర్కిల్ పరిధిలో విచ్చలవిడిగా కొనసాగుతున్న అక్రమ భవన, షేడ్ ల నిర్మాణాలే టౌన్ ప్లానింగ్ విభాగంలో జరుగుతున్న అవినీతికి నిదర్శనలు అనే ఆరోపణలు ఉన్నాయి.

అక్రమాలపై కొత్త “డిసి” విచారణ జరపాలి..

అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపాల్సిన అధికారులే.. ఆ నిర్మాణాలకు పరోక్షంగా సహకరిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. తూతూ మంత్రంగా నోటీసులు ఇవ్వడం, నామ్ కే వాస్తే సీజ్ లు చేయడం.. ఆ తర్వాత నిర్మాణాలకు సైలెంట్ గా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం దుండిగల్ సర్కిల్ లో ఆనవాయితీగా మారిందని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై దృష్టి సారించాలి. కేవలం కాగితాలకే పరిమితమైన ‘సీజ్’ల వెనుక ఉన్న అసలు రహస్యాన్ని వెలికితీసి, బాధ్యులైన అధికారుల పైనా, అక్రమ నిర్మాణాల పైనా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాగా కొత్త డిప్యూటీ కమిషనర్ డా. ఎస్ వెంకట మణి కరన్ టౌన్ ప్లానింగ్ విభాగాన్ని ప్రక్షాళన చేయాలని, గత సీజింగ్ భవనాలు నేడు అక్రమంగా పూర్తి అవుతున్న అంశాలపై విచారణ జరిపి భాధ్యులు అయిన సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments