HomeCUREకేంద్రమంత్రి కుమారుడికి చట్టాలు వర్తించవా?

కేంద్రమంత్రి కుమారుడికి చట్టాలు వర్తించవా?

Date: Posted By : LOCAL VIBES

Copyright © 2026 LOCAL VIBES. All rights reserved.

_ పోక్సో కేసులో నిందితుడిని కాపాడేందుకు ప్రభుత్వాల పన్నాగం_

_ నెపాన్ని బాధితురాలిపైకి నెడుతూ ‘హనీట్రాప్’ నాటకాలు

_ PDSU, IFTU మహిళా సంఘాల తీవ్ర ఆరోపణలు

_పేట్‌ బషీరాబాద్‌ పోలీస్ స్టేషన్ వద్ద దద్దరిల్లిన నిరసనలు

లోకల్ వైబ్స్, పేట్ బషీరాబాద్: న్యాయం కోసం అభాగ్యులు ఎదురుచూస్తుంటే.. అధికార బలం నిందితులకు రక్షణ కవచంగా మారుతోందని మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై అత్యంత కఠినమైన పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదైనా ఇంతవరకూ కటకటాల వెనక్కి నెట్టకపోవడాన్ని నిరసిస్తూ పీవోడబ్ల్యూ (POW), పీడీఎస్‌యూ (PDSU), ఐఫ్టూ (IFTU) శ్రేణులు కదం తొక్కాయి. ఈ మేరకు ఆయా సంఘాల నాయకులు, మహిళలు పేట్ బషీరాబాద్ ఠాణా వద్ద పెద్దఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు.

పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న మహిళా సంఘాలు

అరెస్టులో ఈ జాప్యం దేనికి సంకేతం?

ఈ ఆందోళన కార్యక్రమంలో పీవోడబ్ల్యూ జాతీయ ప్రతినిధి ఝాన్సీ మాట్లాడుతూ.. ఖాకీల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఫిర్యాదు అంది వారం గడుస్తున్నా నిందితుడిని ఎందుకు విచారించట్లేదని నిలదీశారు. విచారణలో జరుగుతున్న తీవ్ర జాప్యం వెనుక ఉన్నత స్థాయి రాజకీయ ప్రమేయం ఉందన్న అనుమానాలను ఆమె వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి పలుకుబడితోనే పోలీసు యంత్రాంగం నిందితుడికి వత్తాసు పలుకుతోందని విమర్శించారు.

బాధితురాలిపైనే నెపం మోపుతారా?

అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అసలు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు బండి సంజయ్ యత్నిస్తున్నారని ఝాన్సీ ధ్వజమెత్తారు. ఇందులో భాగంగానే సాక్షాత్తూ మైనర్ బాలికపైనే ‘హనీట్రాప్’ ఆరోపణలు చేస్తూ ఎదురు కేసు నమోదు చేయడాన్ని ఆమె అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు. నిందితులను వదిలేసి, బాధితురాలిపైనే తప్పుడు కేసులు బనాయించేందుకు పోలీసులు సహకరించడం వ్యవస్థల వైఫల్యానికి అద్దం పడుతోందని మండిపడ్డారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు లోపాయికారీ ఒప్పందంతో ఈ కేసును బుట్టదాఖలు చేసేందుకు కుట్ర పన్నుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

నినాదాలు గొప్ప.. ఆచరణ శూన్యం

బేటీ బచావో’ అంటూ ఆడపిల్లల రక్షణ గురించి దేశవ్యాప్తంగా ఉపన్యాసాలు దంచే అధికార పార్టీ నేతలు.. తీరా తమ ఇళ్లలో తప్పు జరిగితే మాత్రం ‘సొంత నేత కొడుకును బచావో’ అన్న చందంగా వ్యవహరిస్తున్నారని మహిళా నేతలు దుయ్యబట్టారు. బండి సంజయ్‌కు ఏమాత్రం నైతిక విలువలున్నా తక్షణమే తన పదవి నుంచి వైదొలగాలని, లేదంటే కేంద్ర ప్రభుత్వమే ఆయనకు మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలకాలని డిమాండ్ చేశారు. భగీరథను తక్షణం నిర్బంధించి చట్టప్రకారం కఠినంగా శిక్షించకపోతే.. ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఆందోళన కారులు అరెస్ట్

కాగా పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేస్తున్న పలువురు మహిళలను పోలీసుకు అరెస్ట్ చేశారు. శాంతి భద్రతల నేపథ్యంలో వారిని ఇతర పోలీస్ స్టేషన్లకు తరలించారు.

IFTU అనురాధ ను అరెస్ట్ చేస్తున్న పోలీసులు
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments