ఒకవైపు నగర ప్రజలు గుక్కెడు నీటికోసం అల్లాడుతుంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం ‘ఫోర్త్ సిటీ’ పేరుతో పగటికలలు కంటున్నారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
‘ఫోర్త్ సిటీ’ వద్దు.. గుక్కెడు నీళ్లివ్వు!
_ హైదరాబాద్ బస్తీల్లో మళ్లీ నీటి కటకట.. ట్యాంకర్ల కోసం ఎదురుచూపులు
_ గాలి మోటార్ల ప్రయాణాలు.. గాలి మాటల హామీలు
_ సీఎం తీరుపై కుత్బుల్లాపూర్ జలమండలి వద్ద బీఆర్ఎస్ కన్నెర్ర
_ వారం రోజుల్లో నిధులివ్వకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తాం: ఎమ్మెల్యే వివేకానంద
లోకల్ వైబ్స్, కుత్బుల్లాపూర్: ఒకవైపు నగర ప్రజలు గుక్కెడు నీటికోసం అల్లాడుతుంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం ‘ఫోర్త్ సిటీ’ పేరుతో పగటికలలు కంటున్నారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నెలకొన్న తీవ్ర తాగునీటి ఎద్దడిని నిరసిస్తూ సోమవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జలమండలి కార్యాలయం వద్ద భారీ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. సామాన్యుల కష్టాలను, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ ఈ నిరసన సాగింది.

గాలి మోటార్లలో తిరుగుతూ.. గాలి మాటలు..
కోటి మందికి పైగా జనాభా నివసించే హైదరాబాద్ నగరంలో కనీస అవసరమైన తాగునీటిని అందించలేని ముఖ్యమంత్రి.. ఎక్కడో జనాభా లేని ప్రాంతంలో ‘ఫోర్త్ సిటీ’ నిర్మిస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గాలి మోటార్లలో తిరుగుతూ, ప్రజలకు గాలి మాటలు చెబుతున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు 420 వాగ్దానాలు చేసి, ప్రజల చెవిలో పూలు పెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు ఏ ఒక్క ప్రతిజ్ఞనూ అమలు చేయడం లేదని దుయ్యబట్టారు. నగర అభివృద్ధిని గాలికొదిలేసి, నిధులను ఢిల్లీకి తరలించడంపైనే ప్రభుత్వం దృష్టి పెట్టిందని ఆరోపించారు.
నాడు జల సిరి.. నేడు ట్యాంకర్ల గిరి..
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ముందుచూపుతో రూ.2000 కోట్లు వెచ్చించి రిజర్వాయర్లు, పైపులైన్లు నిర్మించారని, ఆ పదేళ్లలో ఏ రోజూ ఆడబిడ్డలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన పరిస్థితి లేదని ఎమ్మెల్యే గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ పాలనలో మళ్లీ పాత రోజులు వచ్చాయని, 24 గంటలు నీళ్లిస్తామన్న హామీ నీటిమూటగానే మిగిలిపోయిందని ఎద్దేవా చేశారు. ప్రజలు మళ్లీ నీటి ట్యాంకర్ల కోసం కళ్లుకాయలు కాసేలా ఎదురుచూసే దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్లో నయాపైసా కేటాయించకపోవడంతో జలమండలి, సీవరేజ్ బోర్డులు పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయాయన్నారు.

సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తాం..
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిద్రలేచి జలమండలికి తగిన నిధులు విడుదల చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. వారం, పది రోజుల్లోగా పెండింగ్లో ఉన్న మురుగునీటి కాలువల నిర్మాణాలు, తాగునీటి సమస్యలను పరిష్కరించకపోతే.. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బస్తీవాసులతో కలిసి నేరుగా సీఎం రేవంత్ రెడ్డి ఇంటినే ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఖాళీ బిందెలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందస్తుగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో బి ఆర్ ఎస్ మాజీ కార్పొరేటర్లు, కార్పొరేట్ టికెట్ ఆశావహులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

