విద్యా రంగంలో 65 సంవత్సరాల విశిష్ట, నిరంతర సేవలను పూర్తి చేసుకున్న ప్రసిద్ధ విద్యా సంస్థ శివశివాని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ (ఎస్ఎస్జీఐ) తన బ్లూ సఫైర్ జూబ్లీ (1961–2026) వేడుకలను ఆగస్టు 3న అత్యంత ఘనంగా నిర్వహించింది.
_ 1961 నుంచి విద్య, విలువలు, నాయకత్వ వికాసమే ధ్యేయంగా అడుగులు…
_ ఆగస్టు 3న అట్టహాసంగా జరిగిన బ్లూ సఫైర్ జూబ్లీ (1961–2026) వేడుకలు…
_ గౌరవ అతిథిగా హాజరైన భారత సైన్య విశ్రాంత అధికారి, ట్రైయాథ్లాన్ ఛాంపియన్ కల్నల్ గౌరవ్ దత్తా…
_ కేజీ (KG) నుంచి పీహెచ్డీ (Ph.D.) వరకు సమగ్ర విద్యనందిస్తున్న అరుదైన విద్యాసంస్థ…
_ “Learn to Serve” ఆదర్శ వాక్యంతో కొనసాగుతున్న ప్రస్థానం…
లోకల్ వైబ్స్, కొంపల్లి: విద్యా రంగంలో 65 సంవత్సరాల విశిష్ట, నిరంతర సేవలను పూర్తి చేసుకున్న ప్రసిద్ధ విద్యా సంస్థ శివశివాని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ (ఎస్ఎస్జీఐ) తన బ్లూ సఫైర్ జూబ్లీ (1961–2026) వేడుకలను ఆగస్టు 3న అత్యంత ఘనంగా నిర్వహించింది. ఆరు దశాబ్దాలకు పైగా విద్యా నాణ్యత, విలువల ఆధారిత బోధన, నాయకత్వ వికాసం మరియు సమాజ సేవలో ఈ సంస్థ అందిస్తున్న సేవలు అజరామరమైనవని ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు. విద్యా సంస్థ ప్రెసిడెంట్ ఆర్తి సంపతి అధ్యక్షతన జరిగిన ఈ చారిత్రాత్మక వేడుకల్లో దేశానికి సేవ, నాయకత్వం అందించే ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన ఆలయం – కల్నల్ గౌరవ్ దత్తా..
ఈ చారిత్రాత్మక వేడుకలకు భారత సైన్యంలో విశిష్ట సేవలందించిన, ట్రైయాథ్లాన్ ఛాంపియన్గా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన రిటైర్డ్ కల్నల్ గౌరవ్ దత్తా గౌరవ అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “శివశివాని నా జీవితంలో కేవలం ఒక విద్యాసంస్థ మాత్రమే కాదు, నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన పవిత్ర ఆలయం. సైన్యంలో నేను ప్రదర్శించిన ధైర్యం, నాయకత్వం, క్రమశిక్షణకు ఇక్కడ పొందిన విలువలే బలమైన పునాది. నేటి విద్యార్థులు సవాళ్లను అవకాశాలుగా మలుచుకుంటూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి” అని పిలుపునిచ్చారు. క్రమశిక్షణ, ధైర్యం, పట్టుదలతో కూడిన ఆయన జీవిత ప్రయాణం యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని పలువురు కొనియాడారు.

ఆరు దశాబ్దాల విద్యా ప్రస్థానం: ప్రెసిడెంట్ ఆర్తి సంపతి..
విద్యా సంస్థ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆర్తి సంపతి మాట్లాడుతూ.. గత 65 సంవత్సరాలుగా శివశివాని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వేలాది మంది విద్యార్థులను విద్య, విలువలు, నాయకత్వ లక్షణాలతో తీర్చిదిద్ది దేశ విదేశాల్లో వివిధ రంగాల్లో రాణించేలా చేసిందని తెలిపారు. పాఠశాల విద్య నుంచి ఉన్నత, వృత్తిపరమైన విద్య వరకు నాణ్యమైన బోధన అందిస్తూ సంస్థ విశిష్ట గుర్తింపు పొందిందన్నారు. విద్యార్థుల్లో విద్యా ప్రావీణ్యం, నైతిక విలువలు, ఆవిష్కరణాత్మక దృక్పథం పెంపొందిస్తూ విజయవంతమైన పూర్వ విద్యార్థులను సమాజానికి అందించామని ఆమె హర్షం వ్యక్తం చేశారు.

కేజీ నుంచి పీహెచ్డీ వరకు సమగ్ర విద్య: వైస్ ప్రెసిడెంట్ డా. శైలేష్ సంపతి..
విద్యా సంస్థ వైస్ ప్రెసిడెంట్ డా. శైలేష్ సంపతి మాట్లాడుతూ.. భవిష్యత్తులో కూడా ప్రపంచ స్థాయి విద్య, విలువలతో కూడిన నాయకత్వానికి ప్రాధాన్యమిస్తూ బాధ్యతాయుతమైన పౌరులను తీర్చిదిద్దేందుకు సంస్థ కట్టుబడి ఉందని తెలిపారు. తల్లిదండ్రులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థుల అపారమైన విశ్వాసంతో నేడు శివశివాని గ్రూప్ ఒకే క్యాంపస్లో రెండు డిగ్రీ కళాశాలలు, ఒక పాఠశాల, ఒక జూనియర్ కళాశాల, అలాగే మేనేజ్మెంట్ విద్యాసంస్థలను విజయవంతంగా నిర్వహిస్తోందన్నారు. కేజీ నుంచి పీహెచ్డీ వరకు సమగ్ర విద్యను అందిస్తున్న అరుదైన విద్యాసంస్థల్లో శివశివాని ఒకరిగా నిలిచిందని పేర్కొన్నారు.

“Learn to Serve” ఆదర్శ వాక్యమే మా బలం: అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ దీపికా సంపతి…
విద్యా సంస్థ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ దీపికా సంపతి మాట్లాడుతూ.. 1961లో స్థాపితమైన నాటి నుంచి “Learn to Serve” అనే ఆదర్శ వాక్యంతో సంస్థ సేవలు అందిస్తోందని చెప్పారు. పాఠశాల విద్య నుంచి డిగ్రీ, పీజీ, మేనేజ్మెంట్ కోర్సులను అత్యున్నత ప్రమాణాలతో నిర్వహిస్తూ, విద్యతో పాటు సామాజిక బాధ్యతను పెంపొందిస్తున్నామని తెలిపారు. విద్య, విలువలు, సమాజ సేవ అనే మూడు ప్రధాన సూత్రాలతో శివశివాని దేశంలోని ప్రముఖ విద్యాసంస్థల సరసన నిలిచిందని ఆమె పేర్కొన్నారు.ఈ బ్లూ సఫైర్ జూబ్లీ వేడుకల్లో వివిధ విభాగాల అధిపతులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు, పరిశ్రమల ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంస్థ వ్యవస్థాపకుల దూరదృష్టిని స్మరించుకున్నారు. “Serving the Cause of Education” అనే నినాదంతో సాగిన ఈ వేడుకలు సంస్థ అపూర్వ ప్రస్థానాన్ని కళ్లకు కట్టాయి.


