HomeCUREబడి స్థలంలో గుడి పేరిట కబ్జా కుట్ర!

బడి స్థలంలో గుడి పేరిట కబ్జా కుట్ర!

Date: Posted By : LOCAL VIBES

Copyright © 2026 LOCAL VIBES. All rights reserved.

పేద, మధ్యతరగతి విద్యార్థులకు విద్యాబుద్ధులు పంచుతున్న ప్రగతినగర్‌లోని జిల్లా పరిషత్‌ (జడ్పీ) ఉన్నత పాఠశాల స్థలంపై కబ్జాకోరుల కన్ను పడింది అని ఆరోపిస్తూ, బడి క్రీడా మైదానాన్ని (ప్లే గ్రౌండ్‌) గుడి పేరిట గుట్టు చప్పుడు కాకుండా ఆక్రమించుకునేందుకు జరుగుతున్న యత్నాలపై స్థానికులు భగ్గుమన్నారు.

_ ఆటస్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నం

_ అడ్డుకున్న ఉపాధ్యాయులపై బెదిరింపులు*

_ సర్వే నంబర్ 164, 181లో రెండెకరాల జడ్పీహెచ్‌ఎస్‌ భూమి అక్రమ ప్రయత్నిస్తున్నారని ఆరోపణ

_ కలెక్టర్, ‘హైడ్రా’ జోక్యం చేసుకోవాలన్న ఆకుల సతీష్

_ ప్లకార్డులతో ప్రగతినగర్‌ పౌరుల జేఏసీ నిరసన

లోకల్ వైబ్స్ , నిజాంపేట : సర్కిల్‌ పరిధిలోని ప్రగతినగర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల (జడ్పీహెచ్‌ఎస్‌) స్థలాన్ని కబళించేందుకు కొందరు కబ్జాకోరులు కుట్రలు పన్నుతున్నారు అని ఆరోపిస్తున్నారు ప్రగతి నగర్ వాసులు. బడి క్రీడా మైదానంలో గుడి కట్టి, ఆ ముసుగులో స్థలాన్ని ఆక్రమించుకునేందుకు యత్నిస్తుండటంతో స్థానికులు భగ్గుమన్నారు. విద్యాదేవాలయాన్ని కాపాడుకునేందుకు ‘ప్రగతినగర్‌ పౌరుల జేఏసీ’ ఆధ్వర్యంలో బడి గేటు ఎదుట ప్లకార్డులతో ఆందోళనకు దిగారు. ‘స్కూల్ భూమిని కాపాడాలి’, ‘విద్యను రక్షించాలి’ అంటూ కబ్జాదారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ ప్రతినిధులు, స్థానికులు మాట్లాడుతూ.. ఏళ్ల తరబడిగా ఎంతోమంది పేద విద్యార్థులకు భవిష్యత్తును ఇస్తున్న ఈ బడి స్థలాన్ని కబళించాలని చూడటం దారుణమన్నారు. పాఠశాల ఆస్తుల వైపు కన్నెత్తి చూస్తే ఊరుకునేది లేదని, అక్రమ నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని తేల్చిచెప్పారు. క్రీడామైదానాన్ని ఆక్రమించేందుకు తెరవెనుక జరుగుతున్న కుట్రలను తక్షణమే నిలిపివేయాలని హెచ్చరించారు.

ప్రభుత్వ పాఠశాల ముందు పాఠశాల భూమిని రక్షించాలి అంటూ ప్రగతి నగర్ ఆధ్వర్యంలో నినాదాలు చేస్తున్న ప్రగతి నగర్ వాసులు..

ఆకుల సతీష్‌ మాట్లాడుతూ.. ప్రగతినగర్‌ ఏర్పడిన తొలినాళ్లలో (సుమారు 20 ఏళ్ల క్రితం) సర్వే నంబర్‌ 164, 181 లోని రెండెకరాల స్థలంలో ఈ ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేశారన్నారు. ప్రస్తుతం ఇక్కడ వెయ్యి మందికి పైగా పేద, మధ్యతరగతి విద్యార్థులు చదువుకుంటూ తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటున్నారని తెలిపారు. ఎకరం స్థలంలో బడి భవనం ఉండగా, మిగతా సగం స్థలం పిల్లల ఆటల కోసం ప్లే గ్రౌండ్‌గా ఉందన్నారు. ఇప్పుడు కొందరు దుర్మార్గులు ఆ ఆటస్థలంలో దేవాలయం కడుతున్నామని చెప్పి ఆక్రమించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు.

ఉపాధ్యాయులపై దౌర్జన్యం..

గతంలో పార్కులు, ప్రభుత్వ భూములు, హౌసింగ్ బోర్డు స్థలాలను ఆక్రమించిన భవానీ ప్రసాద్, మల్లేష్‌ తదితరులే ఈ అక్రమాలకు పాల్పడుతున్నారని సతీష్ తీవ్ర ఆరోపణలు చేశారు. స్థలాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులపై వారు దౌర్జన్యానికి దిగుతున్నారని మండిపడ్డారు. గురువులపై జరుగుతున్న ఈ దౌర్జన్యాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్నారు.

పాఠశాల భూమిని కాపాడాలి అంటూ ఫ్ల కార్డ్స్ ను ప్రదర్శిస్తున్న ప్రగతి నగర్ జేఏసీ సభ్యులు…

క్రిమినల్ కేసులు నమోదు చేయాలి..

పార్టీలు, వ్యక్తులకు అతీతంగా ఈ బడిని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆకుల సతీష్‌ పిలుపునిచ్చారు. పాఠశాల స్థలంలోకి అక్రమంగా ప్రవేశించిన వారిపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మేడ్చల్ కలెక్టర్, డిప్యూటీ కమిషనర్, హైడ్రా (HYDRA) కమిషనర్, స్థానిక ఎస్‌హెచ్‌వో తక్షణమే ఈ వ్యవహారంపై స్పందించి కబ్జాదారుల బారి నుంచి పాఠశాలను కాపాడాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించి పిల్లలకు నాణ్యమైన విద్య అందేలా చూడాలని, బడి స్థలాన్ని ఆక్రమించే కుట్రలను ఆపకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments