తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ జీవోను అనుసరించి అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డులను మంజూరు చేస్తామని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మనో చౌదరి స్పష్టం చేశారు.

లోకల్ వైబ్స్, మేడ్చల్ జిల్లా కలెక్టరేట్: జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేసే ప్రక్రియలో నిబంధనలకు లోబడి వ్యవహరించాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మనో చౌదరి పేర్కొన్నారు. గురువారం జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ ప్రతినిధులు కలెక్టరేట్‌ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.జిల్లాలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న నిజమైన జర్నలిస్టులందరికీ త్వరితగతిన అక్రిడిటేషన్లు అందించాలని వారు కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆయన ప్రభుత్వ నిబంధనల (జీవో) ప్రకారం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ కార్డులు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు.
*అవకతవకలకు ఆస్కారం ఉండొద్దు..*
అయితే, అర్హులైన జర్నలిస్టుల ఎంపికలో ఎక్కడా ఎలాంటి అవకతవకలకు ఆస్కారం ఇవ్వొద్దని ఈ సందర్భంగా కలెక్టర్ స్పష్టం చేశారు. జర్నలిస్టుల గుర్తింపు ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరగాలని కమిటీ సభ్యులకు ఈ మేరకు ఆయన దిశానిర్దేశం చేశారు.ఈ కీలక భేటీలో అక్రిడిటేషన్ కమిటీ ప్రతినిధులు కల్లేపల్లి రవిచంద్ర, మోతే వెంకట్ రెడ్డి, గడ్డమీది బాలరాజు, రాజేష్ రెడ్డి, రామారావు, సునీల్, ప్రసాద్, భూపాల్, యూసుఫ్ దిన్, అబుద్ స్వామిలతో పాటు జిల్లా పౌర సంబంధాల అధికారులు (డీపీఆర్ఓ) స్వర్ణలత, నాగంజలి , ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

