నిజాంపేట్ కార్పొరేషన్ ప్రస్తుత నిజాంపేట్ సర్కిల్ పరిధిలో జరిగిన తీవ్ర అవినీతి అంశాలపై చర్యలు తీసుకోవాలని, నిజాంపేట సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ను తక్షణమే బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ సాక్ష్యాధారాలతో సామాజిక కార్యకర్త ఆకుల సతీష్ సోమవారం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సృజన కు లిఖిత పూర్వక ఫిర్యాదును అందజేశారు.
_ సాబీర్ అలీపై తీవ్ర అవినీతి, అక్రమాల ఆరోపణలు..
_ సమగ్ర విజిలెన్స్ విచారణ జరపాలని ఆకుల సతీష్ డిమాండ్..
_ ప్రభుత్వ భూములు, పార్కుల్లో యథేచ్ఛగా అనధికార నిర్మాణాలు..
_ చర్యలు శూన్యం.. ఫిర్యాదులు బుట్టదాఖలు…
_ డంపింగ్ యార్డ్ బిల్లుల చెల్లింపుల్లో భారీగా కమీషన్ల దందా..
_ టీఎస్-బీపాస్ ముసుగులో అక్రమ అంతస్తులకు వసూళ్లు..
_ గ్రేటర్ విలీన సమయంలోని 250 బిల్లుల విజిలెన్స్ నివేదిక ఏదీ?..
_ పూర్తి ఆధారాలతో CMC అధికారులకు ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్త ఆకుల సతీష్..
లోకల్ వైబ్స్, నిజాంపేట్: నిజాంపేట్ కార్పొరేషన్ (ప్రస్తుత నిజాంపేట్ సర్కిల్) పరిధిలో అక్రమాల పర్వం అంశాలపై, డిప్యూటీ కమిషనర్ సాబీర్ అలీపై తీవ్రస్థాయిలో అవినీతి, విధుల పట్ల నిర్లక్ష్యం ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అక్రమ నిర్మాణాలకు అండగా నిలుస్తూ, కమీషన్ల దందాకు తెరలేపారని సామాజిక కార్యకర్త ఆకుల సతీష్ తీవ్రంగా ఆరోపిస్తూ మండిపడ్డారు. డీసీని తక్షణమే బదిలీ చేసి, ఆయన హయాంలో జరిగిన బాగోతంపై సమగ్ర విజిలెన్స్ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు పూర్తి ఆధారాలతో సోమవారం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
ఆక్రమణలకు అడ్డూ అదుపూ లేదు..
2023 ఆగస్టులో నిజాంపేట్ సర్కిల్ డీసీగా సాబీర్ అలీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ప్రభుత్వ భూములకు రక్షణ కరవైందని ఆకుల సతీష్ ఆరోపించారు. ప్రజల అవసరాల కోసం ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో, వివిధ పార్కుల్లో యథేచ్ఛగా అక్రమ ఆక్రమణలు, అనధికార నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. దీనిపై పౌరులు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ, సంబంధిత అధికారులు కనీస చర్యలు తీసుకోకుండా ఫిర్యాదులను బుట్టదాఖలు చేస్తున్నారని విమర్శించారు.
బిల్లుల దందా.. కమీషన్ల కక్కుర్తి
క్షేత్రస్థాయిలో సమస్యలను గాలికొదిలేసిన అధికారులు, బిల్లుల చెల్లింపుల కోసం మాత్రం కక్కుర్తి పడుతున్నారని సతీష్ ఆరోపించారు. తీవ్రంగా ఉన్న డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించకపోగా, అక్కడి రూ. 3.5 కోట్ల బిల్లుల చెల్లింపుల కోసం భారీగా కమీషన్లు వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంజనీరింగ్ విభాగంలో నాసిరకం పనులను ప్రోత్సహిస్తూ, బిల్లుల చెల్లింపుల్లో పెద్ద ఎత్తున గోల్‌మాల్‌కు పాల్పడుతున్నారని తెలిపారు. అంతేకాకుండా, సుమారు 150కి పైగా టీఎస్-బీపాస్ (TS-bPASS) ఇన్స్టంట్ అనుమతుల పేరుతో అక్రమ అంతస్తుల నిర్మాణాలకు భారీగా వసూళ్లు జరిగినట్లు, అక్రమ హోల్డింగ్స్‌కు సైతం కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు.
విజిలెన్స్ నివేదిక ఏమైంది?..
కాగా, గతేడాది నవంబర్ నెలలో నిజాంపేట్ సర్కిల్ కమిషనర్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ప్రజలతో కలిసి భారీ ధర్నా నిర్వహించినా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అధికారుల్లో చలనం లేదని సతీష్ ఆవేదన వ్యక్తం చేశారు. నిజాంపేట్ సర్కిల్ జీహెచ్ఎంసీ (GHMC)లో విలీనం అయ్యే సమయంలో జరిగిన అక్రమాలపై, సుమారు 250 బిల్లుల చెల్లింపుల వ్యవహారంపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణ ప్రారంభించిందని, అయితే ఇప్పటివరకు ఆ నివేదికను ఎందుకు బహిర్గతం చేయలేదని ఆయన ప్రశ్నించారు.ఈ పది నెలల కాలంలో నిజాంపేట్ సర్కిల్ పరిధిలో జరిగిన అక్రమాలు, అవినీతి బాగోతంపై పూర్తి ఆధారాలతో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన ఐ ఎ ఎస్ కు సోమవారం ఫిర్యాదు చేసినట్లు ఆకుల సతీష్ వెల్లడించారు. వెంటనే డీసీ సాబీర్ అలీని ఆ స్థానం నుంచి బదిలీ చేసి, ఆరోపణలన్నింటిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో అరుణ్ రావు, అంకం సతీష్, పండు తదితరులు పాల్గొన్నారు.

