పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన భారీ రక్తదాన శిబిరం ద్వారా ఎంతోమంది తలసేమియా బాధిత చిన్నారులకు ప్రాణదాతలుగా నిలిచారు. ఈ విశేష సేవలకు గుర్తింపుగా హైదరాబాద్ తలసేమియా సొసైటీ.. జీడిమెట్ల పోలీసులకు ప్రతిష్టాత్మక ‘ఔట్ స్టాండింగ్ సర్వీస్ అవార్డు’ను ప్రదానం చేసింది.
_ హైదరాబాద్ తలసేమియా సొసైటీ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక పురస్కారం
_ పోలీసు అమరవీరుల దినోత్సవ రక్తదాన శిబిరానికి విశేష గుర్తింపు..
_ రికార్డు స్థాయిలో 423 యూనిట్ల రక్తం సేకరణ..
_ తలసేమియా బాధిత చిన్నారులకు అండగా నిలిచిన పోలీసుల చొరవ..
_ ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా అవార్డు ప్రదానం..
_ అత్యధిక రక్త యూనిట్లు సేకరించినందుకు దక్కిన అరుదైన గౌరవం..
_ ఈ పురస్కారం ప్రజలు, రక్తదాతలకే అంకితం..
_ సహకరించిన ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలిపిన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ సీఐ గడ్డం మల్లేష్..
లోకల్ వైబ్స్, జీడిమెట్ల: శాంతి భద్రతల పరిరక్షణలోనే కాదు, సామాజిక బాధ్యతలోనూ జీడిమెట్ల పోలీసులు ఆదర్శంగా నిలిచారు. పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన భారీ రక్తదాన శిబిరం ద్వారా ఎంతోమంది తలసేమియా బాధిత చిన్నారులకు ప్రాణదాతలుగా నిలిచారు. ఈ విశేష సేవలకు గుర్తింపుగా హైదరాబాద్ తలసేమియా సొసైటీ.. జీడిమెట్ల పోలీసులకు ప్రతిష్టాత్మక ‘ఔట్ స్టాండింగ్ సర్వీస్ అవార్డు’ను ప్రదానం చేసింది.

రికార్డు స్థాయిలో రక్త సేకరణ..
గతంలో పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో సీఐ గడ్డం మల్లేష్ ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి స్థానికులు, యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చి రక్తదానం చేశారు. ఏకంగా 423 యూనిట్ల రక్తాన్ని సేకరించి రికార్డు సృష్టించారు. సేకరించిన ఈ రక్తాన్ని తలసేమియా వ్యాధితో బాధపడుతూ నిరంతరం రక్తం అవసరమయ్యే ఎంతో మంది పేద చిన్నారులకు అందించారు.
అత్యధిక యూనిట్లు సేకరించినందుకే అవార్డు..
ప్రతి ఏటా ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. అత్యధిక మొత్తంలో రక్త యూనిట్లను సేకరించి, రక్తదాన శిబిరాలు విజయవంతంగా నిర్వహించిన వారికి తలసేమియా సొసైటీ ఈ అవార్డులను అందజేస్తుంది. ఇందులో భాగంగానే ఈ సంవత్సరం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యధికంగా రక్తం సేకరించినందుకు గాను వారికి ఈ ‘ఔట్ స్టాండింగ్ సర్వీస్ అవార్డు’ను ప్రదానం చేసి సత్కరించారు.
అందరి సహకారంతోనే ఈ ఘనత: సీఐ గడ్డం మల్లేష్..
ఈ ప్రతిష్టాత్మక అవార్డు రావడం పట్ల జీడిమెట్ల సీఐ గడ్డం మల్లేష్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ అవార్డు రావడానికి ప్రధాన కారణమైన జీడిమెట్ల ప్రాంత ప్రజలందరికీ, స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేసిన దాతలకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ఏర్పాటు చేయడానికి సహకరించిన దాతలకు, శిబిరాన్ని ఈ స్థాయిలో నిర్వహించడానికి నిరంతరం మార్గనిర్దేశం చేసిన ఉన్నతాధికారులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లుగా పేర్కొన్నారు.
ప్రాణాపాయ స్థితిలో ఉన్న తలసేమియా చిన్నారుల కోసం జీడిమెట్ల పోలీసులు చూపిన ఈ చొరవపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలతో మమేకమవుతూ సేవలు అందిస్తున్న జీడిమెట్ల పోలీసుల స్పూర్తితో భవిష్యత్తులోనూ మరిన్ని సేవా కార్యక్రమాలు జరగాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు.


