కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథపై కేసు నమోదై మూడు రోజులు గడుస్తున్నప్పటికీ, పోలీసులు అతడిని అరెస్ట్ చేయకపోవడాన్ని నిరసిస్తూ పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద మహిళలు ధర్నా చేశారు.
_ పేట్‌బషీరాబాద్ పీఎస్ మహిళా శ్రేణుల ఆందోళన..
_ నైతిక బాధ్యతతో బండి సంజయ్ తన పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్..
_ బాధిత మైనర్ బాలికకు ప్రభుత్వం అండగా నిలవాలని విజ్ఞప్తి..
లోకల్ వైబ్స్, కుత్బుల్లాపూర్: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథపై కేసు నమోదై మూడు రోజులు గడుస్తున్నప్పటికీ, పోలీసులు అతడిని అరెస్ట్ చేయకపోవడాన్ని నిరసిస్తూ పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద మహిళలు ధర్నా చేశారు. నిందితుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ మహిళా నాయకులు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున తరలివచ్చి పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు.ఈ సందర్భంగా ఆందోళనకారులు పోలీసుల వ్యవహారశైలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడు ఒక కేంద్ర మంత్రి కుమారుడు కావడం వల్లే పోలీసులు ఈ కేసును ఉద్దేశపూర్వకంగా పక్కదారి పట్టిస్తూ నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరోపించారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా భగీరథను అదుపులోకి తీసుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే, ఈ దారుణ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ తన మంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేయాలని మహిళలు నినదించారు. అన్యాయానికి గురైన అభాగ్యురాలైన మైనర్ బాలికకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా బాసటగా నిలవాలని, ఆమెకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకునేంత వరకు తమ నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు. అరుణ రెడ్డి, పద్మ, ఇందిరా రెడ్డి, కవిత, లావణ్య, హేమలత, ఫర్జానా తదితరులు పాల్గొన్నారు.


