*– ఇంస్టాగ్రామ్ వేదికగా డ్రగ్స్ విక్రయాల గైడెన్స్ కు స్వస్తి*
*– ఇద్దరు అరెస్టు…పరారీలో ఒకరు*
*– రూ. 63 లక్షల విలువైన 316 గ్రాముల మెథాంఫెటమైన్ స్వాధీనం*
*– కుత్బుల్లాపూర్ ఎస్ఓటి, జీడిమెట్ల పోలీసులను అభినందించిన డిసిపి కోటిరెడ్డి*

లోకల్ వైబ్స్, జీడిమెట్ల: యువతే టార్గెట్‌గా సాగుతున్న మత్తు దందాకు పోలీసులు చెక్ పెట్టారు. నిన్నటి దాకా గంజాయితో పట్టుబడిన స్మగ్లర్లు, ఇప్పుడు అత్యంత ఖరీదైన డ్రగ్స్‌ను నగరంలోకి దించుతున్నారు. తాజాగా చింతల్ సమీపంలో కుత్బుల్లాపూర్ ఎస్ఓటీ (SOT), జీడిమెట్ల పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఏకంగా రూ. 63 లక్షలకు పైగా విలువైన ‘మెథాంఫెటమైన్‘ (Methamphetamine) పట్టుబడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ అంశంపై కుత్బుల్లాపూర్ జోన్ డిసిపి కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో డిసిపి కోటిరెడ్డి వివరాలను తెలియజేశారు. అడిషనల్ డీసీపీ పురుషోత్తమరావు, ఏసిపి బాలగంగి రెడ్డి, ఎస్ఓటి అడిషనల్ డీసీపీ విశ్వప్రసాద్, జీడిమెట్ల సీఐ గడ్డం మల్లేష్, ఎస్ఓటి సిఐ శ్యాంప్రసాద్, ఎస్ఓటి ఎస్ఐ రామనారాయణ , సిబ్బంది పాల్గొన్నారు..
*పక్కా సమాచారంతో దాడులు..*
ఏప్రిల్ 3, 2026న జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్ కమాన్ సమీపంలో ఉన్న గణేష్ నగర్లో చట్టవిరుద్ధంగా డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయన్న పక్కా సమాచారంతో కుత్బుల్లాపూర్ SOT మరియు జీడిమెట్ల పోలీసులు వ్యూహాత్మకంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అత్యంత ఖరీదైన డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి 316 గ్రాముల మెథాంఫెటమైన్ (విలువ రూ. 63,20,000), 2 తూకం వేసే యంత్రాలు (విలువ రూ. 8,000), 1 మొబైల్ ఫోన్ (విలువ రూ. 10,000) లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ మొత్తం రూ. 63 లక్షల 38 వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

*పరారీలో మాస్టర్ మైండ్..*
ఈ ఆపరేషన్‌లో డ్రగ్స్ అమ్ముతున్న జీడిమెట్లకు చెందిన వేముల సాయి కుమార్ (పెడ్లర్), అలాగే డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న జగద్గిరిగుట్టకు చెందిన తిరుమల అరవింద్ అలియాస్ మారి (కన్స్యూమర్)లను పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ ముఠాకు ప్రధాన సరఫరాదారుడిగా ఉన్న కుత్బుల్లాపూర్‌కు చెందిన ‘పూజిత్’ అనే వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పూజిత్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వీరికి పరిచయమై, ఎక్కడ డ్రగ్స్ తీసుకురావాలి, ఎలా విక్రయించాలి అని గైడ్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
*కమర్షియల్ క్వాంటిటీ.. నాన్-బెయిలబుల్ కేసు*
నిందితుల వద్ద దొరికిన డ్రగ్ పరిమాణం 50 గ్రాములు దాటితే చట్టప్రకారం ‘కమర్షియల్ క్వాంటిటీ’ కింద పరిగణిస్తారు. వీరు ఏకంగా 316 గ్రాముల మెథాంఫెటమైన్‌తో పట్టుబడటంతో, వీరిపై NDPS చట్టం (సెక్షన్లు 8(c) r/w 22(c), 27(b), 29) కింద క్రైమ్ నంబర్ 306/2026 తో నాన్-బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లుగా డిసిపి కోటిరెడ్డి తెలిపారు. నిందితులను జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
*రివార్డు ప్రకటించిన డిసిపి..*
చట్టవిరుద్ధమైన డ్రగ్స్ విక్రయాలు, వాడకంపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. అనుమానాస్పద డ్రగ్స్ కార్యకలాపాలు, నకిలీ విత్తనాలు, లేదా నకిలీ ఆరోగ్య ఉత్పత్తుల తయారీకి సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి సమాజాన్ని కాపాడటంలో భాగస్వాములు కావాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బేస్ లెవెల్లో డ్రగ్స్ మహమ్మారిని అరికట్టేందుకు కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు కూడా ముమ్మరంగా నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా ఈ భారీ డ్రగ్స్ ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన కుత్బుల్లాపూర్ SOT , జీడిమెట్ల పోలీసులను డీసీపీ కోటిరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. వారికి తగిన రివార్డులు అందజేస్తామని తెలిపారు.

