శ్రీ వాసవి మాత జయంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక పండుగగా గుర్తించడం పట్ల ‘వైశ్య లయన్స్’ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.
లోకల్ వైబ్స్, జగద్గిరిగుట్ట: ఆర్య వైశ్యుల కుల దైవమైన శ్రీ వాసవి మాత జయంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక పండుగగా గుర్తించడం పట్ల ‘వైశ్య లయన్స్’ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయానికి కృతజ్ఞతగా జగద్గిరిగుట్టలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

సమాజంలో ఐక్యత, ధర్మానికి ప్రతీక వాసవి మాత:
సమాజంలో ఐక్యత, ధర్మం, అహింసా సిద్ధాంతాలను ప్రచారం చేసిన వాసవి మాత ఆశయాలను గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని, ఎంతో ప్రశంసనీయమని సభ్యులు కొనియాడారు. ఈ మహత్తర నిర్ణయం ద్వారా వాసవి మాత ఆశయాలు ప్రజల్లోకి మరింత విస్తృతంగా చేరుకుంటాయని, సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వాలు వెల్లివిరుస్తాయని వారు ఆకాంక్షించారు. వాసవి మాత ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో సర్వాంగ సుందరంగా అభివృద్ధి చెందాలని ప్రార్థించారు.
కల్వ సుజాతకు ప్రత్యేక అభినందనలు:
వాసవి మాత జయంతిని అధికారిక పండుగగా ప్రకటించడంలో విశేష కృషి చేసి, ఈ విజయానికి కారకురాలైన వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాతకు వైశ్య లయన్స్ సభ్యులు ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైశ్య లయన్స్ ప్రతినిధులు సుధీర్ మంకాల, దారం ఇంద్రసేన గుప్త, బండారు వరప్రసాద్ గుప్త, గోలి రమేష్ గుప్త, పోల రమేష్ గుప్త, నాంపల్లి విజయ్ గుప్త, నందు గుప్త, వాసవి దేవాలయం మాజీ చైర్మన్ ప్రవీణ్ గుప్త తదితరులు పాల్గొన్నారు.

