_పక్కింటి బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టిన నిందితులు..
_చెరో రూ. 10 వేల జరిమానా, బాధితురాలికి రూ. 5 లక్షల పరిహారం..
_ కర్ణాటకకు చెందిన నిందితులకు పడిన కఠిన శిక్ష..
_ వివరాలను వెల్లడించిన సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ ఎ. ముత్యంరెడ్డి..
_ బాలికపై లైంగిక దాడి కేసులో తండ్రీకొడుకులకు జీవిత ఖైదు
లోకల్ వైబ్స్, జీడిమెట్ల: ఏడేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో తండ్రీకొడుకులకు కోర్టు జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ ఎ. ముత్యంరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… కర్ణాటకలోని గుల్బర్గాకు చెందిన శివకుమార్ (45), అతని కుమారుడు శామ్యూల్ (21) కొంపల్లిలో నివసిస్తూ ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు. 2023 ఆగస్టు 10న స్థానికంగా ఉండే కూలీ దంపతులు పనికి వెళ్తూ తమ ఇద్దరు పిల్లలను ఇంట్లో వదిలి వెళ్లారు. రాత్రి వారు తిరిగివచ్చేసరికి ఏడేళ్ల కుమార్తె తీవ్ర నొప్పితో ఏడుస్తూ కనిపించింది. పక్కింటి శివకుమార్, శామ్యూల్ తనను వారి గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు బాలిక తల్లిదండ్రులకు తెలిపింది. దీనిపై నిందితులను నిలదీయగా వారు అక్కడి నుంచి పరారయ్యారు.బాధిత తల్లి ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు అధికారి 2023 ఆగస్టు 12న నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. విచారణ పూర్తి చేసి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పోక్సో కోర్టు ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ జడ్జి కె. వెంకటేష్.. నిందితులపై నేరం రుజువు కావడంతో ఇద్దరికీ జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు. దీంతో పాటు ఇద్దరికీ చెరో రూ.10,000 జరిమానా విధించారు. బాధిత బాలికకు రూ.5 లక్షల పరిహారం అందించాలని కోర్టు ఆదేశించింది. నిందితులకు శిక్ష పడేలా శ్రమించిన పోలీస్ అధికారులను, ప్రాసిక్యూషన్ బృందాన్ని ఈ సందర్భంగా డీసీపీ అభినందించారు.


