జగద్గిరిగుట్ట, సిసిఎస్ కూకట్పల్లి పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ లో నకిలీ పోలీసుల అవతారం ఎత్తి పోలీసు ఉన్నతాధికారులుగా బిల్డప్ ఇస్తూ నేరాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేశారు.
_ వ్యాపారులే టార్గెట్‌గా హైటెక్ దోపిడీ!
_ హరియాణా సస్పెండెడ్ కానిస్టేబుల్ శిక్షణతో నేరాలు
_ నలుగురు నిందితుల అరెస్ట్.. తుపాకులు, ఖాకీ దుస్తులు స్వాధీనం
_ జగద్గిరిగుట్ట , కూకట్పల్లి సి సి ఎస్ పోలీసుల సంయుక్త ఆపరేషన్
_ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించిన డిసిపి కోటిరెడ్డి
లోకల్ వైబ్స్, జీడిమెట్ల: కటకటాల వెనుక పరిచయం.. బయటకు వచ్చాక ఒక ముఠాగా ఏర్పాటు.. వాళ్లలో ఒకరు సస్పెండ్ అయిన రియల్ కానిస్టేబుల్.. ఇంకేముంది, పోలీసుల లాగా ఎలా ప్రవర్తించాలి? ఎవరిని ఎలా బెదిరించాలి? అనే దానిపై పక్కా ట్రైనింగ్. యూనిఫాంలు, ఫేక్ ఐడీలతో రోడ్డెక్కిన ఈ ముఠా అచ్చం సినిమాల్లో లాగానే వ్యాపారులను టార్గెట్ చేసి కిడ్నాప్‌లకు పాల్పడింది. కానీ, టెక్నాలజీ ముందు వాళ్ళ ఆటలు సాగలేదు. జగద్గిరిగుట్ట, కూకట్పల్లి సిసిఎస్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ లో సరిగ్గా ఇలాంటి ముఠానే అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ జోన్ డిసిపి బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.

జైలు నుంచి ఫేక్ పోలీస్ వరకు..
ఏపీకి చెందిన రౌడీ షీటర్ నాగరాజు రఘువర్మ (A1), హరియాణాకు చెందిన సస్పెండెడ్ కానిస్టేబుల్ సునీల్ కుమార్ సహా మరికొందరు జైలులో కలుసుకున్నారు. బయటకు రాగానే నాగరాజు మాస్టర్ మైండ్‌తో, సునీల్ కుమార్ సాంకేతిక, పోలీసు శిక్షణతో ఒక పక్కా ప్లాన్ వేశారు. ఫేక్ ఐడీలు, ర్యాంక్ బ్యాడ్జీలు, తుపాకులు, హ్యాండ్‌కఫ్స్ సమకూర్చుకుని ఒక నకిలీ పోలీస్ స్టేషన్‌నే తమ కార్లలో సృష్టించుకున్నారు.

అలియాస్ పేర్లు:
కార్తికేయ (Karthikeya)
వంశీ (Vamshi)
అల్లూరి విజయరామ్ (Alluri Vijayaram)
కల్నల్ కార్తికేయ సింగ్ (Col. Karthikeya Singh)
వ్యాపారిని టార్గెట్ చేసి…దొరికిపోయారు..
కూకట్‌పల్లిలోని జయనగర్‌కు చెందిన వ్యాపారి కావూరి పూర్ణచంద్రరావును టార్గెట్ చేసిన ఈ ముఠా, మే 18, 2026న జగద్గిరిగుట్ట శోభోదయ కాలనీ సమీపంలో అతను బైక్‌పై వెళ్తుండగా కారులో వచ్చి అడ్డగించింది. తాము పోలీసులమని, అతడిపై హరియాణాలో క్రిమినల్ కేసు నమోదైందని బెదిరించిన ఆ నకిలీ పోలీసులు.. నమ్మకం కలిగించేందుకు ఏకంగా ఒక ఫేక్ వీడియో కాల్ ద్వారా తమ ముఠాలోని మరొకరితో పోలీస్ అధికారిలా మాట్లాడించారు. అనంతరం పూర్ణచంద్రరావును బలవంతంగా కారులో ఎక్కించుకుని సూర్యాపేట వైపు కిడ్నాప్ చేశారు. మార్గమధ్యలో అతన్ని భయభ్రాంతులకు గురిచేసి ఏటీఎం ద్వారా లక్ష రూపాయలు, ఫోన్‌పే ద్వారా మరో లక్ష రూపాయలు డ్రా చేయించడంతో పాటు, ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా మొత్తం కలిపి ఏకంగా రూ.5,26,000 దోచుకున్నారు. ఆ తర్వాత అతన్ని దారుణంగా కొట్టి, ఫోన్ సిమ్ కార్డు లాగేసుకుని, కేవలం ఒక బేసిక్ మొబైల్ మాత్రమే చేతిలో పెట్టి నిర్మానుష్య ప్రాంతంలో వదిలేసి పారిపోయారు. బాధితుడి పిర్యాదు మేరకు జగద్గిరి గుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

పట్టించిన ట్రాఫిక్ చాలన్.. ఫేషియల్ రికగ్నిషన్..
పోలీసులమంటూ తిరుగుతున్న ఈ ఫేక్ పోలీసుల గుట్టు రట్టు చేయడానికి రియల్ పోలీసులకు టెక్నాలజీయే పెద్ద ఆయుధమైంది. కూకట్‌పల్లి సీసీఎస్, జగద్గిరిగుట్ట పోలీసులు సంయుక్తంగా రంగంలోకి దిగారు. సీసీ కెమెరాల ఫుటేజీలు, ట్రాఫిక్ చలాన్లు, మరియు ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ (యాంబిస్ యాప్) ఉపయోగించి నిందితుల కదలికలను ట్రేస్ చేశారు. పక్కా ఆధారాలతో మాస్టర్ మైండ్ నాగరాజు సహా నలుగురిని (యశ్వంత్ సింగ్, సత్యభాన్ సింగ్, నాగేంద్ర వర్మ) అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా ఫేక్ పోలీస్ సామగ్రిని, ఆయుధాలను, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ముఠాకు శిక్షణ ఇచ్చిన సస్పెండెడ్ కానిస్టేబుల్ సునీల్ కుమార్, మరో సభ్యుడు ప్రదీప్ కుమార్ పరారీలో ఉన్నారు.

నిధితుల నేర చరిత్ర ఇది…
కాగా పట్టుబడిన నిందితులకు నేర చరిత్ర ఉన్నట్లుగా డీసీపీ పేర్కొన్నారు. ముఠా ప్రధాన సూత్రధారి అయిన నాగరాజు రఘువర్మ అలియాస్ కార్తికేయ పై తెలుగు రాష్ట్రాలతో పాటు జార్ఖండ్ లో మొత్తం 12 కేసులు ఉన్నాయి. మాదాపూర్, కేపీహెచ్‌బీ పీఎస్ పరిధిలో గతంలో ఇతనిపై రెండుసార్లు పీడీ యాక్ట్ నమోదైంది. ఏపీలోని పోడూరు పీఎస్‌లో రౌడీషీటర్. మరో నిందితుడు యశ్వంత్ సింగ్ అలియాస్ రాహుల్ (యూపీ) గతంలో ఒక చోరీ కేసులో నిందితుడు, ప్రదీప్ కుమార్ మిశ్రా (బీహార్) తెలంగాణలోనే ఏకంగా 14 ఆస్తి నేర కేసుల్లో నిందితుడుగా (ప్రస్తుతం పరారీ), సత్యభాన్ సింగ్ అలియాస్ ఠాకూర్ (యూపీ) దుండిగల్, ఆర్‌సీ పురం పీఎస్ పరిధిలో జరిగిన దోపిడీ కేసుల్లో నిందితుడుగా, తంగెళ్లపల్లి నాగేంద్ర వర్మ (మహబూబాబాద్) పై అబిడ్స్, చిలకలగూడ, సైదాబాద్, సైబర్ క్రైమ్ పీఎస్‌లలో కలిపి 5 కేసులు ఉన్నాయి అని తెలిపారు.

దర్యాప్తు బృందానికి డీసీపీ అభినందనలు..
ఇక కేసు చేదనలో సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ ముత్యం రెడ్డి, అడిషనల్ డీసీపీ పురుషోత్తం పర్యవేక్షణలో కీలక పాత్ర పోషించిన అధికారులు కుత్బుల్లాపూర్ ఎ సి పి బాలగంగి రెడ్డి, నాగేశ్వర్ రావు (క్రైమ్స్ ఏసీపీ), పి. నరేంద్ర రెడ్డి (జగద్గిరిగుట్ట డీఐ), కె. రవికుమార్ (సీసీఎస్ ఇన్‌స్పెక్టర్), కానిస్టేబుళ్లు పురాన్ దాసు, నరేష్ , నరేష్ గౌడ్, సుమ, కూకట్‌పల్లి సీసీఎస్ టీమ్ ఎస్ ఐ నరసింహ, ఎలియాజర్, అర్జున్ కుమార్ , అంజి, అస్గర్ , చందర్ లను డీసీపీ కోటిరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. వారికి రివార్డ్ అందేవిధంగా సిఫార్సు చేయడం జరుగుతుందని అన్నారు.

