సూరారం సాయిబాబా నగర్ ప్రాంతంలో ఉన్న గాజులరామారం గ్రామ రెవిన్యూ సర్వేనెంబర్ 49/6 లో మంగళవారం కుత్బుల్లాపూర్ రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు.
_ జేసీబీలతో అక్రమ నిర్మాణాల కూల్చివేత
_ 15 నిర్మాణాలను కూల్చివేశం: గాజులరామారం ఆర్ఐ ఖలీం
లోకల్ వైబ్స్, గాజులరామారం: సూరారం సాయిబాబా నగర్ సర్వేనెంబర్ 49/6 లో పలు అక్రమ నిర్మాణాలను కుత్బుల్లాపూర్ రెవిన్యూ అధికారులు కూల్చివేశారు. ఫిర్యాదులు, కోర్టు కేసులు, కమిషన్ పరిధిలో పిటీషన్లు నేపథ్యంలో ఈ కూల్చివేతలకు ప్రాధాన్యం సంతరించుకుంది. దాదాపు గా 15 ఇండ్లను తొలగించినట్లుగా అధికారులు పేర్కొన్నారు. మల్కాజ్గిరి ఆర్డిఓ ఆదేశాల మేరకు గాజులరామారం రెవిన్యూ ఇన్స్పెక్టర్ కలీం బృందం మంగళవారం ఉదయం ఈ కూల్చివేతలు చేపట్టారు.

ఆది నుంచి వివాదాలే… గతంలోనూ కూల్చివేతలు
ప్రస్తుతం కూల్చివేతలు జరిగిన సర్వే నంబర్ 49 లో వివిధ బై నెంబర్ లు ఉన్నాయి. గతంలో ఇక్కడి భూములను దిల్ సంస్థకు ప్రభుత్వం కేటాయించింది. కాలక్రమంలో ఈ విలువైన భూములపై ఆక్రమణదారుల కన్ను పడింది. న్యాయస్థానాల్లో కేసులు, వివాదాలు నడుస్తున్న సమయంలోనే కొందరు ఇక్కడ రాత్రికి రాత్రే అక్రమ కట్టడాలకు తెరలేపారు. అనేకమార్లు ఈ ప్రాంతంలో రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాలు తొలగిస్తూనే ఉన్నారు. ఓ సందర్భంగా ఇక్కడ భారీ స్థాయిలో పెద్ద ఎత్తున కూల్చివేతలు సైతం జరిగాయి. యాజమాన్య హక్కుల వ్యవహారంపై ఈ సర్వే నంబర్‌లోని వివిధ సబ్-నెంబర్లలో గత కొన్నేళ్లుగా తీవ్ర స్థాయిలో వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. కబ్జాలు, ఫిర్యాదుల పర్వం కొనసాగుతుండటం, ఇదివరకు కూడా ఈ ప్రాంతంలో అధికారులు భారీ ఎత్తున కూల్చివేతలు చేపట్టడం గమనార్హం.

